మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో గిరిజన అమరవీరులను స్మరించుకుంటూ జన జాతీయ గౌరవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డి ఆర్ ఓ కె చంద్రశేఖర రావు, గిరిజన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.,
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు స్వాభిమానం గౌరవంతో వేరొకరి సొమ్ముకు ఆశపడకుండా జీవించే వారని ప్రస్తుతించారు. వారు ఆర్థికంగా వెనుకబడినప్పటికీ సాంఘికంగా, మహిళా సాధికారతలో ఎంతో ముందు ఉంటారని అన్నారు. విద్య లేక, సరైన అవగాహన లేక కనీసం ఆధార్ కూడా పొందలేకపోతున్నారని, ఈ అంశంపై దృష్టి సారించి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి గిరిజనులకు ఆధార్ నమోదుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలకు ఆధార్ కీలకం కాబట్టి ఒకచోట స్థిరపడి ఉండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జిల్లా సమగ్ర అభివృద్ధిలో గిరిజనులను భాగస్వామ్యం చేయుటకు కృషి చేస్తామన్నారు.
గిరిజన జాతుల ఆత్మ గౌరవాన్ని పరిరక్షించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర పోరాటంలో గిరిజన అమరవీరుడు బిర్సా ముండా స్ఫూర్తిని దేశవ్యాప్తం చేసే లక్ష్యంతో ఆయన జన్మదినాన్ని జన జాతీయ గౌరవ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి ఫణి ధూర్జటి కార్యక్రమ నిర్వహణ పర్యవేక్షించారు. గిరిజన సంఘం నాయకులు కుంభ అయ్యప్ప స్థానిక సుకర్లబాదలో నిర్మిస్తున్న గిరిజన కమ్యూనిటీ హాల్ నిర్మాణం మధ్యలో నిలిచిపోయిందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, కారణాలు తెలుసుకొని, కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేస్తామన్నారు. నెహ్రూ యువ కేంద్రం మై భారత్ టీం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు వెంకటేశ్వరరావు తదితరులు, గిరిజన సోదరులు పాల్గొన్నారు.