-ఈ నెల 18వ తేదీ నుంచి మండల, మున్సిపల్ స్థాయిలోనూ కార్యక్రమం అమలు
-మరింత సమర్థంగా సుపరిపాలను ప్రజలకు చేరువచేసేందుకు చర్యలు
-జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలుచేసేందుకు ఈ నెల 18వ తేదీ సోమవారం నుంచి మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ డా. నిధి మీనా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సమీప మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువచేసేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీనివల్ల త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిబద్ధతతో ప్రజల సమస్యలను సత్వరం నాణ్యవంతమైన పరిష్కారానికి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా, డివిజన్ స్థాయిలోనూ కార్యక్రమం యథాతథంగా అమలవుతుందని ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా సూచించారు.