Breaking News

పేదలకు ఉచితంగా ఖరీదైన వైద్యం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలు వైద్యం కోసం ఎక్కడా ఇబ్బందులు పడకుండా.. ఇంటి వద్దకే ప్రభుత్వం మెరుగైన వైద్యసేవలు అందిస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అజిత్ సింగ్ నగర్లోని ఎం.కె.బేగ్ ప్రభుత్వ పాఠశాల నందు బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాల‌ని, వారి ఆరోగ్య అవ‌స‌రాలు తీర్చడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యకమానికి ప్రభుత్వం కారం చుట్టిందని మల్లాది విష్ణు అన్నారు. ఇంటి వ‌ద్దే 7 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి వారికి 5 దశల్లో ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. 59వ డివిజన్లోని 235, 253, 254 వార్డు సచివాలయాల పరిధిలో 3,635 కుటుంబాలను సందర్శించిన వైద్య సిబ్బంది 4,513 రకాల పరీక్షలు నిర్వహించడం ద్వారా 1,339 టోకెన్లు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇంకా ఎవరైనా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్న వారు టోకెన్లు లేకున్నా శిబిరం నిర్వహించే ప్రాంతానికి నేరుగా వెళ్లి వైద్య సేవలు పొందవచ్చన్నారు. జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష వైద్య శిబిరాలు ఇత‌ర వైద్య శిబిరాల కంటే ఎంతో ప్రత్యేకమైన‌వ‌ని, ఈ శిబిరాల్లో నిర్వహించిన వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్షల స‌మాచారంతో ప్రతి వ్యక్తికీ ఒక హెల్త్ ప్రొఫైల్ రూపొందించ‌డం జ‌రుగుతుంద‌ని మల్లాది విష్ణు అన్నారు. ఈ ప్రొఫైల్ ఆయా వ్యక్తులకు భ‌విష్యత్తులో ఏదైనా ఆరోగ్య స‌మ‌స్యలు వ‌చ్చిన‌పుడు ఉపయోగపడుతుందని తెలిపారు. శిబిరాల్లో అంద‌జేసే హెల్త్ ప్రొఫైల్‌ను ప్రతిఒక్కరూ భ‌ద్రప‌ర‌చి జాగ్రత్తగా ఉంచుకోవాల‌ని సూచించారు. వీరందరికీ ప్రతి 15 రోజులకోసారి మందులను ఉచితంగా అందజేస్తారని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం అవసరమని గుర్తించిన వారికి పెద్ద ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతుందన్నారు.

ప్రజల చెంతకే కార్పొరేట్ వైద్యం
నిరుపేదలకు రూపాయి ఆర్థిక భారం పడకుండా పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మల్లాది విష్ణు తెలిపారు. ఇందుకోసం గతంలో కంటే మిన్నగా 3,200 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. విజయవాడ నగరంలో 29 ఆస్పత్రులలో ప్రస్తుతం పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నట్లు చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో 1,69,376 లక్షల కుటుంబాలకుగానూ.. 71,982 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో వీరందరికీ 160 కోట్ల రూపాయల సేవలు అందించినట్లు వెల్లడించారు. శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా కింద రోగులకు ఆర్థిక సహకారం అందించడం జరుగుతోందన్నారు. అలాగే ప్రజల అవసరాల దృష్ట్యా అర్థరాత్రి వేళలలోనూ ముగ్గురు పర్యవేక్షకులను ప్రభుత్వం అందుబాటులో ఉంచడం జరిగిందని.. వారి నెంబర్లను జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల వద్ద ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. హృద్రోగులకు అత్యవసర సమయంలో సేవలకు గానూ జీజీహెచ్ లో రూ. 45 వేలు ఖరీదు చేసే ఇంజక్షన్లు అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. పేదల ఆరోగ్యానికి ఇంతలా భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. దేశంలోనే మరొకటి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం రోగులకు మందులతో కూడిన మెడికల్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సృజనా, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు హఫీజుల్లా, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, గల్లెపోగు రాజు, చింతా శ్రీను, షేక్ వెంకట్, కొండా జయలక్ష్మి, పిల్లి లక్ష్మి, ఎండి షఫీ, షేక్ ఆసిఫ్, గోనెల కృష్ణ, డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *