– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పింఛన్ దారుల సంక్షేమానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ సీతారామపురంలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి శుక్రవారం ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. చంద్రబాబు పాలనలో కొత్త పింఛన్ మంజూరు కావాలంటే అవ్వాతాతలు పడే పాట్లు వర్ణనాతీతమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తుచేశారు. ఏళ్లు గడుస్తున్నా దస్త్రం మాత్రం కదిలేది కాదని.. ఆత్మాభిమానాన్ని చంపుకొని చివరకు జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు. అలాగే పింఛన్ అందుకునేందుకు రోజుల తరబడి పడిగాపులు పడుతూ, చాంతాడంత క్యూలో నిలుచోలేక నరకయాతన అనుభవించేవారని చెప్పారు. పైగా పింఛన్ డబ్బులలో సగం ఆటో ఖర్చులకే సరిపోయేవని.. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక చిన్న కష్టం కూడా తెలియకుండా, ప్రతి నెలా ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి అందిస్తున్నట్లు వెల్లడించారు. పింఛన్ అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించిన ఘనత కూడా సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు అందేవని.. కానీ ఈ ప్రభుత్వంలో 65.33 లక్షల మందికి నెలకు రూ. 1,800 కోట్లు అందజేస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది దాదాపు 4 రెట్లు అధికమన్నారు. అలాగే సెంట్రర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 17 వేలు మాత్రమే ఉన్న పింఛన్లను 26,419 కి పెంచి ప్రతినెలా రూ.7.39 కోట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కొత్త సంవత్సరంలో ఈ పింఛన్ ను రూ. 3 వేలుకు పెంచబోతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో పీఓయూసీడీ రోహిణి, సీడీఓ జగదీశ్వరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.