చెప్పాం… చేస్తున్నాం… ఇచ్చిన ప్రతి హామీ అమలే లక్ష్యం!

-ప్రజలకు సంక్షేమం.. రాష్ట్రానికి అభివృద్ధి.. ఇదే కూటమి ప్రభుత్వ సంకల్పం: దేవినేని ఉమా
-“చెప్పాం – చేస్తున్నాం” పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి దేవినేని ఉమా, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ

తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన “చెప్పాం – చేస్తున్నాం” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి దేవినేని ఉమా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలు, రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. హామీల అమలు – ప్రజా సంక్షేమం – రాష్ట్ర అభివృద్ధి.. ఇదే “చెప్పాం – చేస్తున్నాం” కార్యక్రమ స్ఫూర్తి అని తెలిపారు.