మహిళా పారిశ్రామికవేత్తలు వ్యాపారాలను విస్తరించాలి

-జాతీయ సారస్ మేళాలో మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ ముఖాముఖి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడలోని పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సారస్ ఆజీవిక మేళా–2026లో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే కార్యక్రమం నిర్వహించారు. SME ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన “సెల్ మీ యువర్ ప్రొడక్ట్” కార్యక్రమంలో సెర్ప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధుల మిషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వాకాటి కరుణ, సెర్ప్, మెప్మా పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి మాట్లాడారు.

ఈ సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలు ప్రదర్శించిన నైపుణ్యం, సృజనాత్మకత, ఉత్పత్తుల నాణ్యతను వాకాటి కరుణ అభినందించారు. మహిళలు తమ ఉత్పత్తులకు మెరుగైన బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ కల్పించాలని సూచించారు. విస్తృత మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుని తమ వ్యాపారాలను స్థిరమైన వృద్ధి దిశగా తీసుకెళ్లాలని ప్రోత్సహించారు. అనంతరం ఆమె నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన నెస్బడ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహిళా పారిశ్రామికవేత్తల సామర్థ్యాలను పెంపొందించేందుకు, వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు, మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థలను బలోపేతం చేసేందుకు క్రమబద్ధమైన నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక శిక్షణ ఎంతో కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

జాతీయ సారస్ ఆజీవిక మేళాలో నిర్వహించిన ఈ కార్యక్రమం మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, వ్యాపార అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు, మార్కెట్ అనుసంధానాలను పెంపొందించుకునేందుకు ఉపయోగపడింది. మహిళలు తమ వ్యాపారాలను మరింత విస్తరించేందుకు అవసరమైన అవగాహన పొందడానికి ఈ కార్యక్రమం చక్కని వేదికగా నిలిచింది.