విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీసీలకే టీడీపీ పెద్దపీట

-17 మంది కార్పొరేటర్ అభ్యర్థుల్లో 11 మంది బీసీలకు అవకాశం కల్పించడం సామాజిక న్యాయానికి నిదర్శనం– ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీసీలకు పెద్దపీట వేస్తూ తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనివ్వడం సంతోషకరమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 17 మంది కార్పొరేటర్ అభ్యర్థుల్లో 11 మంది బీసీలకు అవకాశం కల్పించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా బీ-ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ, బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించడం ద్వారా తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుందని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థులకు అధిక సంఖ్యలో అవకాశాలు కల్పించడం అభినందనీయమని అన్నారు.

రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమష్టిగా పనిచేస్తామని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ప్రజల మద్దతుతో పశ్చిమ నియోజకవర్గంలో వందకు వంద శాతం విజయం సాధించేందుకు కృషి చేస్తామని, ప్రతి డివిజన్‌లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కృషితో అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థులను ఘన విజయం వైపు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బీ-ఫారాలు అందుకున్న అభ్యర్థులు పార్టీ విజయమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లి, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి విశ్వాసాన్ని చూరగొనాలని సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి బలాన్ని మరింత పెంచుతూ, అన్ని డివిజన్లలో విజయఢంకా మోగించేందుకు సమష్టిగా ముందుకు సాగుతామని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు.