-యువతలో నైపుణ్యం పెండచానికి ఎన్‌సిసి తోడ్పడుతుంది.
-రాయలసీమలో ఎన్‌సిసి వృద్ధి కోసం కావలసిన విభాగపరమైన సహాయ సహకారం అందిస్తాము.
-రాష్ట్ర రవాణా యువజన క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డితో కాకినాడ బెటాలియన్ ఎన్‌సిసి అధికారులు సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కల్నల్ మోహన్ అగర్వాల్, లెఫ్టినెంట్ కల్నల్ అనిల్ కుమార్ మెహ్రా సమావేశమయ్యారు. వ్యక్తిగత క్రమశిక్షణ, నాయకత్వం, ఆత్మవిశ్వాసం వంటి అంశాల పెంపొందించడంలో ఎన్‌సిసి యూనిట్లు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని మంత్రి కాంపు కార్యాలయంలో ఎన్‌సిసి కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో సమావేశమయ్యారు. రాజమండ్రిలో 15 నుంచి 20 ఎకరాల భూమి కేటాయింపుకు సహకరించి ఎన్‌సిసి అకాడమీ ఏర్పాటుకు ఆవశ్యకతను మంత్రికి వివరించారు. ఎన్‌సిసి సాధించిన విజయాలు మరియు కార్యక్రమాల గురించి చర్చించారు. క్యాడెట్‌ల అందించిన ఆదర్శప్రాయమైన సహకారాన్ని, ముఖ్యంగా ఇటీవల విజయవాడ వరదల సమయంలో వారి సహాయ చర్యలు, సామాజిక సేవ, సమాజ అభివృద్ధి కార్యక్రమాలలో వారు పాల్గొన్నందుకు మంత్రి వారిని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సామాజిక సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు కల్నల్ రితిన్ అగర్వాల్, లెఫ్టినెంట్ కల్నల్ అనిల్‌కుమార్ మెహ్రా, శిక్షణ అధికారి ఎన్‌సిసి క్యాడెట్‌లను అంబాసిడర్‌లుగా చేర్చామాని తెలిపారు. మంత్రి హామీ ఇచ్చి దేశ నిర్మాణంలో ఎన్‌సిసి పాత్రను ప్రశంసించారు.
రాయచోటిలో ఎన్‌సిసి యూనిట్
రాయచోటి కేంద్రంగా ఎన్‌సిసి యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ ఎన్‌సిసి గ్రూప్ కమాండర్ కి మంత్రి సూచన చేశారు. అలాగే రాయలసీమ లో ఎన్‌సిసి అభివృద్ధి కోసం విభాగపరమైన సహకారం అందిస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు.