-జిల్లాలో ఆక్వారంగాన్ని అభివృద్ధి చేస్తాం
-ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తాం : జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాలో ఆక్వారంగాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని,ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా మత్స్య శాఖ వారు నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో పలు మత్స్యకార సంఘాల నాయకులు, ఆక్వా సాగు రైతులు, హ్యాఛరీ ప్రతినిధులు హాజరవగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు ఆక్వా, మత్స్య పలు అంశాలపై సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆక్వా రైతులను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో ఎక్కువ ఉత్పత్తులు ఉంటూ ఎగుమతిలో ముందుందని తెలిపారు. తిరుపతి జిల్లా మత్స్యకారులకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మత్స్యకార భరోసా పథకం అమలుచేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంతొందని, ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ విజయవాడ వారి సూచనల మేరకు 03.05.2024న బోట్ల గణన నిర్వహించబడిందని తెలిపారు. జిల్లాలో 880 బోట్లు, 4203 మంది సిబ్బంది ఉన్నారన్నారు.
కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టో ప్రకారం, చేపల వేట నిషేధ కాలంలో సముద్ర మత్స్యకారుల కుటుంబాలకు రూ.10,000/- ను పెంచి రూ.20,000/- చేయడానికి కట్టుబడి ఉందని, తద్వారా జిల్లాలో మత్స్యకార భరోసా పథకం కింద 3786 మంది లబ్ధిదారులకు రూ.7.57 కోట్లు మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా సహాయమందించడం మరియు జీవనోపాధి మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యం అన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఫ్లెమింగో ఫెస్టివల్ రాష్ట్ర పండుగగా అటవీ, పర్యాటక మరియు మత్స్య శాఖల సమన్వయంతో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల మధ్యన పులికాట్ సరస్సు నందు చేపల వేటపై మత్స్యకారుల మధ్యతలెత్తిన వివాదంపై జిల్లా కలెక్టర్ గా పక్కన రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించిందని సదరు వివాద శాశ్వత పరిష్కారానికి త్వరలో చర్యలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఆక్వా రైతులకు పవర్ సబ్సిడీ పై త్వరలో ప్రభుత్వం నుండి అందే మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లో ఓల్టేజి కరెంటు సమస్యపై ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులతో సమావేశం నిర్వహించి తగిన సామర్థ్యంతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, కోట మండలం రాచ గన్నేరు వద్ద అవసరం మేరకు సబ్ స్టేషన్ ప్రపోజల్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని, పరిశ్రమలకు కరెంటు సమస్య పరిష్కారానికి ఏపీ ట్రాన్స్ కో ద్వారా జిల్లాలో రెండు సబ్ స్టేషన్ లకు గౌ. ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఆక్వా ఫీడ్ అంశం, అప్సర యాక్ట్ అంశం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అలాగే చుక్కల భూములకు సంబంధించిన అంశాలు ఆక్వా మరియు మత్స్యకారుల రైతులకు సంబంధించినవి త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు పులికాట్ సరస్సుకు సంబంధించి పూడి రాయి దరువు పులికాట్ ముఖ ద్వారం వద్ద పూడికతీత పనులకు పరిపాలన అనుమతులు వచ్చాయని తొందరలోనే నిధులు విడుదల అవుతాయని అనంతరం పూడికతీత పనులు చేపడతామని తెలిపారు. తడ సూళ్లూరుపేట ప్రాంతాలలో ఆక్వా, మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని, అలాగే అన్ని రేవులలో సోలార్ లైటింగ్ ఏర్పాటుకు కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకం అనుసంధానంతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకార కుటుంబాలకు హౌసింగ్ కొరకు కోరిన నేపథ్యంలో తప్పకుండా అర్హత మేరకు మంజూరు చేస్తామని, తుఫాను పునరావస కేంద్రాలు శిథిలావస్థలో ఉన్నాయని పలువురు తెలపగా ప్రతిపాదనలు పంపుతామని, ఎస్ హెచ్ జి రివాల్వింగ్ ఫండ్ సమస్యపై స్పందిస్తూ పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా మత్స్యకార రంగానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఆదిశలో చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అనంతరం పలువురు ఆక్వా మరియు మత్స్యకార సాగు రైతులకు నేతలకు సన్మాన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి నాగరాజు, ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారులు, జిల్లా అధ్యక్షులు మత్స్యకార సహకార సంఘం జివిరత్నం, పులికాట్ సరస్సు మత్స్యకారుల సంఘం బొమ్మన శ్రీధర్, హేచరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాగర్ రెడ్డి, మత్స్య, ఆక్వా సాగు రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.