Breaking News

వివిధ అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎస్.సి.లు అధికంగా నివసించే ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అమలుపై ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద తొలి దశలో 2018-19 నుండి 2020-21 సంవత్సరాలకు 38 గ్రామాలను, రెండవ దశలో 2022-23 సంవత్సరానికి 40 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. మొదటి విడతలోని గ్రామాల అభివృద్ధికి 6.24 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందన్నారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రజలు అధికంగా నివసించే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పరచడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. నిధులు మంజూరు చేసినప్పటికీ మూడు సంవత్సరాలుగా పనులు చేపట్టక, ఖర్చు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ అలా చేస్తే నిధులు మురిగిపోయే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ వెంటనే సవరించిన అంచనాలు అందజేసి పరిపాలన ఆమోదం పొందాలని సూచించారు.

ఈ నిధులను ముఖ్యంగా సిసి.రహదారులు, మురికి కాలువలు నిర్మాణంతో పాటు మంచినీరు పారిశుధ్య మౌలిక సదుపాయాలు , నిధులు లేక అర్ధాంతరంగా నిలిచిపోయిన పాఠశాలలు, అంగన్వాడి భవనాలలో మరుగుదొడ్లు, అంగన్వాడీ భవనాలు నిర్మాణం, సౌర విద్యుత్ దీపాలు వంటి సదుపాయాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.
నిధులను ఏ పనులకు ఖర్చు చేయాలో మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కొందరికి అవగాహన లేకపోవడం సరైనది కాదన్నారు. ఇదివరకే చేపట్టిన కొన్ని పనులను వెంటనే పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇకపై ప్రతి మంగళవారం జరుగుతున్న పంచాయతీరాజ్ తదితర ఇంజనీరింగ్ విభాగాల సమీక్షలో ఈ పథకం అమలుపై కూడా సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈసారి జూమ్ లో సమావేశం నిర్వహిస్తామని, ఆలోగా ప్రతిపాదనలు పంపి పరిపాలన ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. ఈ పథకం కింద చేపట్టే పనులు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు రెండు ఒకటి కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ నిధులతో చేపట్టే మురికి కాలువల నిర్మాణం సరిగా ప్రణాళిక రూపొందించాలని, అవుట్ ఫాల్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అలా కాకుండా చేస్తే ప్రయోజనం లేదని పంట పొలాలల్లోకి నీరు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, జడ్పీ సీఈవో కే కన్నమ్మ నాయుడు, డ్వామా పిడి శివప్రసాద్ యాదవ్, డిపిఓ అరుణ,జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, డిఎల్పివోలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *