-స్థానిక యువకులు క్రీడలు ఆడుకోవచ్చు
-ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చోరవతోనే స్థానికులకు ఉపయోగంలోకి వచ్చిన అవధూత ఆశ్రమం స్థలం
-స్థలాన్ని స్వయంగా పరిశీలించి అనుమతులిచ్చిన దేవాదాయ శాఖా మంత్రి ఆనం వెంకట రామనారాయణరెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని పటమటలంకలో ఉన్న అవధూత ఆశ్రమం స్థలాన్ని వాకింగ్ ట్రాక్‌గా స్థానికులు ఉపయోగించుకోవడానికి అనుమతులు ఇస్తున్నానని దేవాదాయ శాఖా మంత్రి ఆనం వెంకట రామనారాయణరెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని మంత్రి చెప్పారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్‌లో పటమట లంకలోని అవధూత ఆశ్రమం స్థలాన్ని దేవాదాయశాఖా మంత్రి ఆనం వెంకట రామనారాయణరెడ్డి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు లు శుక్రవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం వెంకట రామనారాయణరెడ్డి మాట్లాడుతూ దశాబ్థాల క్రితం ఈ స్థలంలో అవధూత అనే పేరుతో ఒకరు ఈ స్థలంలో ఆయుర్వేద వైద్యం చేస్తూ ఏర్పాటు చేసుకున్న ఆశ్రమ స్థలం ఇది అన్నారు. ఆయనకు కుటుంబం, వారసులు ఎవ్వరూ లేరని, ఆయన మరణం తర్వాత ఈ స్థలం ఇలాగే ఉందన్నారు. అందువల్ల ఈ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరిక మేరకు పరిశీలించానని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది స్థానికులు ఉదయం, సాయంత్రం వేళ వాకింగ్ ట్రాక్‌గా ఉపయోగించుకుంటామని అవకాశం కల్పించాల్సిందిగా కోరారని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరిక మేరకు ఈ స్థలంలో రేపటి నుంచి స్థానికులు వాకింగ్ చేసుకోడానికి అనుమతి ఇస్తున్నానని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి మౌఖికంగా అనుమతులు ఇస్తున్నానని, స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత రాత పూర్వకంగా కూడా అనుమతులు మంజూరు చేస్తానని మంత్రి చెప్పారు. అప్పటి వరకు ఈ స్థలంలో వాకింగ్ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా కింది స్థాయి అధికారులకు మంత్రి అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు. ఈ స్థలానికి ఆలనా పాలన లేకపోవడంతో ఈ స్థలానికి కాపలాగా ఉంటున్న ఒక వ్యక్తికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చి స్థలాన్ని పరిరక్షిస్తు, స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారన్నారు. స్థానికంగా ఉంటున్న వారు ఎవరైనా వచ్చి ఈ స్థలంలో క్రీడా పోటీలు నిర్వహించుకోడానికి అనుమతులు కావాలన్నా ఇస్తామని మంత్రి చెప్పారు. దేవాదాయ శాఖకు చెందిన ఈ స్థలాన్ని పరిరక్షించుకుంటూనే భవిష్యత్తులో ఏమి చేయాలనే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌తో చర్చిస్తానని మంత్రి అన్నారు. ప్రస్తుతానికి ఈ స్థలంలో స్థానికులు వాకింగ్ చేసుకోడానికి, స్థానిక యవకులు క్రీడలు ఆడుకోడానికి పూర్తి స్థాయిలో అనుమతులు ఇస్తున్నానని మంత్రి ఆనం వెంకట రామనారాయణరెడ్డి చెప్పారు. ఈ ఆశ్రమం కిందనే ఉన్న ఇళ్ళు, ఈడ్పుగల్లులో ఉన్న పోలం ద్వారా వచ్చే నగదును అన్నింటిని ఒక ఎకౌంట్‌లో జమ చేస్తామని అన్నారు. ప్రభుత్వానికి చెందిన ఆస్తి కాబట్టి ఈ స్థలాన్ని పరిరక్షిస్తామని మంత్రి చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ పటమట లంకలోని అవధూత ఆశ్రమం గురించి చెప్పిన వెంటనే వచ్చి స్థలాన్ని పరిశీలించడమే కాకుండా వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చిన మంత్రి ఆనం వెంకట రామనారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా ఉంటున్న వారు ఈ స్థలంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకుంటామని ఎప్పటి నుంచో అడుగుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాల్లో వాకింగ్ చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారన్నారు. ప్రజలకు ఏదీ సౌకర్యంగా ఉంటుందో ఆ పనులను చేయడానికి తమ కూటమి ప్రభుత్వం వెనుకాడదని చెప్పారు. స్థానికులందరూ ఈ స్థలంలో వాకింగ్‌తో పాటుగా ఇతర క్రీడలను ఈ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చునని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
సంతోషంలో స్థానికులు
పటమట అవధూత ఆశ్రమానికి చెందిన స్థలంలో వాకింగ్‌తో పాటుగా ఇతర క్రీడలు ఆడుకోడానికి మంత్రి ఆనం వెంకట రామనారాయరెడ్డి అనుమతులు ఇవ్వడంతో స్థానికులు సంతోషంతో మంత్రికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలను చెప్పిన వెంటనే మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి మంత్రిని ఇక్కడకు తీసుకురావడమే కాకుండా అనుమతులు కూడా ఇప్పించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌కు స్థానికులు అభినందనలతో ముంచెత్తారు.
ఈ కార్యక్రమములో చెన్నుపాటి గాంధీ, ఎ.విద్యాసాగర్, చెన్నుపాటి ఉషారాణి, చెన్నుపాటి క్రాంతి, శ్రీనివాసరావు, ఎనగంటి ప్రదీప్, అన్నాబత్తుల శ్రీదేవి, యలమంచలి దేవేంద్ర, చిలకలపూడి లక్ష్మీనరసింహారావు, కొడాలి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.