-రైతుల సేవే అత్యున్నత సేవ – బాధ్యతతో సేవలు అందించాలి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జివనానికి మూలాధారమైన ఆహారం పండించే రైతు సేవ కంటే సృష్టిలో మరేది గొప్పది కాదని వ్యవసాయ శాఖ జిల్లా వనరుల కేంద్రం జిల్లా ట్రైనింగ్ కోఆర్డినేటర్ భాస్కరయ్య అన్నారు. రబీ సాగుకు రైతులను సమాయత్తం చేయుటకు కలెక్టరేట్లో సమావేశ మందిరంలో వ్యవసాయ విస్తరణ సిబ్బంది శిక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన సేవలను రైతులకు బాధ్యతతో, గౌరవంగా అందించాలని ఆయన సిబ్బందిని కోరారు. ప్రజల అనారోగ్యానికి కారణం అవుతున్న రసాయనాల వాడకాన్ని వీలైనంతవరకు నియంత్రించాలని ఆయన కోరారు. భూములకు కలుపు మందులు, గుళికల పురుగు మందుల వాడకంతో భూములు నిర్జీవమైపోయి, నిస్సారమవుతున్నాయని వివరించారు. దీనివలన భవిష్యత్తులో ఆహార ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. దీనికోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన సిబ్బందిని కోరారు. మేలైన యాజమాన్య పద్ధతులతో, పొలంబడి కార్యక్రమం ద్వారా రసాయన రహిత ఆహార ధాన్యాలు పండించాలని ప్రభుత్వం చేస్తున్న కృషికి సిబ్బంది సహకరించాలని కోరారు. అన్ని ప్రభుత్వ పథకాలకు ఈ పంట నమోదు చాలా అవసరమని, దీనిని బాధ్యతతో, ఎలాంటి తప్పులు లేకుండా చేయాలని చెప్పారు. ఈ పంట నమోదు, పంటల బీమా, పీఎం కిసాన్, చీడల గుర్తింపు, నివారణ యాప్ లపైన జిల్లా వ్యవసాయ కార్యాలయం టెక్నికల్ అధికారులు హరిత, గాయత్రి, శశికళ, వాణి, సరళ వివరించారు. శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల కీటక శాస్త్ర నిపుణులు డాక్టర్ పాండురంగ వరిలో చేపట్టవలసిన చీడల నివారణ గురించి వివరించారు. శ్రీకాళహస్తికి చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి సహజ వనరుల సద్వినియోగం, జీవ వైవిద్య సంరక్షణ, సేంద్రీయ సాగుపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో విస్తరణ సిబ్బందితోపాటు జిల్లా వనరుల కేంద్రం ఏడిఎ లక్ష్మీదేవి, ఏఓలు శశిధర్ రెడ్డి, వేణుగోపాలరావు, శ్రీనివాసులు పాల్గొన్నారు.