-ఇక పై జరిగే అన్ని నియామకాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్లు…
-ఏపిపియస్సీ సభ్యులు యస్. సలాంబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇక పై ఏపిపియస్ సి నిర్వహించే అన్ని నియామకాల్లో గ్రూప్-1 మినహా, ప్రిలిమ్స్ పరీక్షలు ఉండవని ఏపిపియస్ సి సభ్యులు యస్. సలాంబాబు చెప్పారు. అలాగే ఆర్ధికంగా వెనుకబడిన కులాలకు ఉద్యోగ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కూడా అమలు పరుస్తామన్నారు. శుక్రవారం స్థానిక రోడ్లు భవనాల శాఖ సముదాయంలో పత్రికా విలేఖరుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన 32 నోటిఫికేషన్లలో 30 నోటిఫికేషన్లలో నియామకాలు పూర్తి చేశామన్నారు. గ్రూప్-1, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ల నియామకాలు మాత్రం కోర్టుల్లో ఉన్నాయన్నారు. వ్రాతపరీక్ష, ఇంటర్వ్యూలలో తీసుకువచ్చిన మార్పులవల్ల ఎలాంటి అభ్యంతరాలు, పొరపాట్లు జరగకుండా నియామకాలు పూర్తి చేసామన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపిపియస్ సికి పూర్తిగా సహకరించిందన్నారు. గతంలో పరీక్షల నిర్వాహణ, ఇంటర్వ్యూలు, రిజల్ట్స్ ప్రకటనకు సుమారు ఏడాదిన్నర కాలం పట్టేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రకటన వచ్చిన మూడు నెలల్లో పరీక్ష నిర్వహించి ఆతర్వాత ఇంటర్వ్యూ , ఫలితాల ప్రకటనలన్నీ త్వరితగతంగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గత రెండేళ్లుగా నిరుద్యోగులు, సంఘాల నుండి ప్రిలిమినరీ పరీక్షలు రద్దు చేయమని ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయన్నారు. ఆసంఘాలతో సెమినార్లు పెట్టుకుని అందులో వచ్చిన విజ్ఞప్తులు మేరకు ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేయాలని ఏపిపియస్ సి నిర్ణయం తీసుకుందన్నారు. ఆ మేరకు సవరణలు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకపై జరిగే పరీక్షలన్నింటికీ ఇంటర్వ్యూలు రద్దుచేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ఈనిర్ణయంవల్ల పారదర్శకత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపిపియస్ సి ద్వారా వచ్చే ఆగష్టు మాసంలో 1180 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేస్తున్నామన్నారు. ఇందులో క్రొత్తగా ఫారెస్ట్ బీట్ అధికారులు, అసిస్టెంట్ బీట్ అధికారులు, అసిస్టెంట్ ఇంజినీర్లు భర్తీకి క్రొత్త పోస్టులు కూడా అదనంగా చేరాయన్నారు. జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల నియమకం, హార్టికల్చర్ ఆఫీసర్, శాసనమండలిలో తెలుగు రిపోర్టర్స్, వైద్యశాఖలో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ రానున్నదన్నారు. అలాగే అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జిల్లా పౌర సంబంధాల అధికారుల నియామకం కూడా చేపట్టనున్నామన్నారు.