-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆదివారం యూనియన్ నాయకులు మల్లాది విష్ణుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2005 లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన 108 ఉచిత అంబులెన్స్ సర్వీసులు నేడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విస్తరించాయని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. ప్రజలకు 24*7 అత్యవసర వైద్యసేవలు అందించటం, సకాలంలో ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడటంలో సిబ్బంది పాత్ర ఎంతో కీలకమన్నారు. ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితులలో 108 ఉద్యోగులు అందించిన సేవలు మరువలేనివన్నారు. అటువంటి ఉద్యోగులు ఆత్మాభిమానంతో బాధ్యతలు నిర్వర్తించేందుకు వారి న్యాయబద్ధమైన హక్కులను సాధించాల్సిన అవసరం ఉందని మల్లాది విష్ణు అన్నారు. వారి గ్రాట్యూటీ, ఎర్నెడ్ లీవ్స్ అమౌంట్ చెల్లించటంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా వారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ సంఘాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.