-ప్రజా పోరాటాల్లో తమతో కలిసిరావాలి, తమవంతు పాత్ర పోషించాలని బహుజన లాయర్లకు పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రశ్నించే వైఖరి, నిజాలను నిగ్గదీసి అడగగలిగే నైజం న్యాయవాదులకు ప్రత్యేకంగా ఉంటుందని, బహుజన న్యాయవాదులు వీటిని ఆయుధాలుగా మలిచి ప్రజల బాగుకోసం ఉపయోగించాలని, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు రిటైర్డ్ డీజీపీ డా జుజ్జవరపు పూర్ణచంద్ర రావు న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ఆదివారం బీఎస్పీ ఆధ్వర్యంలో విజయవాడలోని బహుజన లాయర్ల ఫోరమ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ వారు, దేశంలో చట్టబద్దమైన పాలన లేదని, కేవలం కులపాలన ఉందని వాపోయారు. అటు రాష్ట్ర సమస్యలపై, ఇటు ప్రత్యేకంగా దళితులు, బీసీలు, మైనారిటీల కోసం బహుజన్ సమాజ్ పార్టీ పోరాటాలు తీవ్రతరం చేయబోతోందని, వాటికీ బహుజన లాయర్లు వారివంతు సాయం, మద్దత్తు అందించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కూడా ఒక న్యాయవాదేనని, ఆ స్ఫూర్తిని అందరం అలవర్చుకోవాలని అయన అన్నారు.
“యడవల్లిలో గ్రానైట్ కోసం నాటి వైసీపీ సర్కారు దళితుల భూములు లాక్కుంది. బహుజన్ సమాజ్ పార్టీ ఈ భూములు తిరిగి దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, రాష్ట్రంలో ప్రైవేటుపరం అవుతున్న మెడికల్ కాలేజీలు వీటన్నిటినిపై పార్టీ ఉద్యమాలు రచించబోతోంది, రానున్న రోజుల్లో బీసీ సమన్వయ కమిటీ పాత్ర మరింత కీలకం కాబోతోంది. ఈ పోరాటాలకు న్యాయవాదుల పాత్ర విశేషంగా బలం చేకూరుస్తుంది. కేవలం యడవల్లి భూములు తిరిగి దళితులకు ఇప్పించగలిగితే బీఎస్పీ అధికారంలోకి వచ్చినదానితో సమానం.”
“రాష్ట్రంలో అందరికీ సంతోషం అని చెప్పే ముఖ్యమంత్రికి, గ్రానైట్ కోసం 416 ఎకరాల యడవల్లి దళితుల భూములు ఆక్రమణకు గురిఅయినప్పుడు, విశాఖ ఉక్కు ప్రైవేటీకన్నా అవుతున్నప్పుడు, మెడికల్ కాలజీలు ప్రైవేటుపరం అయ్యి పేదలకు వైద్య విద్య అందనపుడు, సంతోషం ఎక్కడ, ఎలా కనపడుతోంది? ప్రతి ఇంటిలో పారిశ్రామికవేత్తలను తయారుచేస్తాననే చంద్రబాబు యడవల్లి భూములను దళితులకు తిరిగి ఇప్పించి వారినే పారిశ్రామికవేత్తలు ఎందుకు చేయించరు?” ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బీ పరంజ్యోతి మరియు ఇతర పార్టీ ముఖ్యనేతలు, లాయర్లు పాల్గొని ప్రసంగించారు.