-డా|| జి. సమరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మతం మనిషిని బానిసగా మారుస్తుందని, స్వేచ్ఛగా శాస్త్రీయంగా ఆలోచింపనివ్వదని, మత రహిత సమాజమే సమాజ పురోగతికి తోడ్పడుతుందని, కోట్లాది ప్రజలకు వివరించి ఆచరించిన మహనీయుడు కీ.శే. గోపరాజు రామచంద్రరావు (గోరా) అని ప్రముఖ వైద్యులు డా||జి. సమరం కొనియాడారు. ఈనెల 24వ తేదీ, ఆదివారం గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో గోపరాజు రామచంద్ర రావు జీవిత ప్రస్థానంపై జరిగిన సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ జి. సమరం హాజరై ప్రసంగించారు. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన గోరా సమాజ మార్పుకు నాస్తికత్వం, గాంధీజీ బోధనలు దోహద పడతాయని నమ్మి జీవితాంతం ఆచరించారన్నారు. అంటరానితనం, సామాజిక అసమానతలు, మూఢ నమ్మకాలపై నిరంతరం ప్రజలను జాగృతులను చేశారని, గాంధీజీతో పరిచయం అయిన తర్వాత సత్యాన్వేషణ ద్వారానే ప్రజల్లో మార్పు తీసుకురాగలమని గాంధీజీని సైతం ప్రభావితం చేసిన మహనీయులు గోరా అని, ప్రతి మనిషి శాస్త్రీయంగా ఆలోచించి, జీవితానికి అన్వయింపు చేసుకొని పురోగమించాలని గోరా బోధించారన్నారు. అసమానతలు, అంతరాలు, దోపిడీ లేని సమాజం కోసం కలలు గన్నారన్నారు. గాంధీజీ నాస్తికత్వం ఎందుకు అని గోరాను ప్రశ్నించిన సందర్భంలో గోరా ప్రజలలో దైవం అనే భావన బానిస ప్రవృత్తికి దారితీస్తుందని, దానికి భిన్నంగా మనిషి ఎదుగుదలకు శాస్త్రీయ దృక్పథంతో కూడిన విజ్ఞానం ఉపయోగపడుతుందని వివరించి గాంధీజీని కూడా ఆ దిశగా ఆలోచింపజేసిన ఆచరణవాది గోరా అని పేర్కొన్నారు. మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ గుర్రం జాషువా కుమారై హేమలతను తన కోడలుగా స్వీకరించి ఆనాటి కులాలకు అతీతంగా ఆచరణలో అమలు చేశారన్నారు. గుర్రం జాషువా మహాకవిగా, ప్రజా కవిగా పేరు ప్రతిష్టలు గాంచినా వారిని కులం పేరుతో అవమానించిన , వివక్షకు గురైన సందర్భాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ గోరా కుటుంబం నాటి సమాజంలో ఉన్న జోగిని, దేవదాసి వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిందని, స్టువర్టుపురంలో కరుడు గట్టిన దొంగలలో మార్పు తీసుకువచ్చి వారికి విద్య, వైద్యం, వసతి సదుపాయాలను కల్పించి, జనజీవన స్రవంతిలో కలిపినారన్నారు. నాస్తిక కేంద్రం ద్వారా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో శాస్త్రీయ దృక్పథ పెంపుదలకు కృషి చేస్తుందన్నారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు, మానవత చైర్మన్ పావులూరి రమేష్, నేస్తం సహ వ్యవస్థాపకులు టి. ధనుంజయ రెడ్డి, గాంధీయవాది, యోగా శిక్షకులు ఇందుశేఖర్, హేతువాది చంద్రశేఖర్ తదితరులు ప్రసంగించారు.