– అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కృషి
– గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యంత కీలకమైన ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని.. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషిచేస్తానని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం ఉదయం డా. జి.లక్ష్మీశ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్‌గా అవకాశమిచ్చినందుకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు గతంలో కలెక్టర్లుగా పనిచేసిన వారి బాటలో నడుస్తూ, ప్రజాప్రతినిధుల సహకారంతో, అధికారుల సమన్వయంతో జిల్లాను అన్ని విధాలా ప్రగతి దిశగా నడిపించేందుకు కృషిచేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా, ప్రణాళికాయుతంగా పనిచేస్తూ, సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమల్లో జిల్లా ముందు వరుసలో నిలిచేలా కృషిచేయనున్నట్లు వెల్లడించారు.
కలెక్టర్ లక్ష్మీశకు జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ ప్రతినిధులు ఆర్‌వీ రోహిణీదేవి, జాహ్నవి, సూర్యారావు, జిల్లా సంఘ ప్రతినిధులు డి.శ్రీనివాస్, రామకృష్ణ, అప్పారావు, రవి, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్‌వీ మోహనరావు, డివిజనల్ పీఆర్‌వో కె.రవి, ఏపీఆర్‌వో వీవీ ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.