– ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో క్షేత్రస్థాయి అధికారులతో నిరంతర సమన్వయం అవసరం
– పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 71 అర్జీలు
– జిల్లాను నెం.1లో నిలిపేందుకు టీమ్ ఎన్‌టీఆర్ కృషిచేయాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుపరిపాలనను ప్రజలకు మరింత చేరువచేసే ఉద్దేశంతో, ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని.. ఈ కార్యక్రమం ద్వారా అందే ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీ అందిన వెంటనే క్షుణ్నంగా పరిశీలించి, సంబంధిత అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో పరిష్కరించాలని సూచించారు. పీజీఆర్ఎస్ అర్జీలతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నైపుణ్యాభివృద్ధి తదితరాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల్లాను ముందు నిలిపేలా టీమ్ ఎన్‌టీఆర్ కృషిచేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు. అర్జీల పరిష్కార ప్రక్రియ పెండింగ్ లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 71 అర్జీలు రాగా.. వీటిలో రెవెన్యూకు సంబంధించిన అర్జీలు 24, పురపాలక, పట్టణాభివృద్ధికి సంబంధించి 10, పంచాయతీరాజ్ 8, ఉపాధికల్పన 4, పోలీస్ 3, సహకార 3, మార్కెటింగ్ శాఖకు సంబంధించి 3 అర్జీలు వచ్చాయి. వైద్య ఆరోగ్యం, గృహ నిర్మాణం, కార్మిక, సర్వే అండ్ సెటిల్‌మెంట్ విభాగాలకు సంబంధించి రెండు చొప్పున అర్జీలు రాగా విద్యుత్, డీఆర్‌డీఏ, డ్వామా, అటవీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, గ్రామీణ నీటి సరఫరా, బ్యాంకింగ్ సేవలు, రహదారులు-భవనాల శాఖకు సంబంధించి ఒకటి చొప్పున అర్జీలు అందాయి. కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను ఆన్‌లైన్లో నమోదు ప్రక్రియతో పాటు హెల్ప్ డెస్క్‌లను కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.