Breaking News

మన భారత రాజ్యాంగం మహోన్నతమైనది

-డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ నిర్మాత స్పూర్తిగా రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టరేట్ నందు ఘనంగా నిర్వహణ
-రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి … రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచంలో కెల్లా అత్యున్నత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అని, రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒకరూ నడుచుకోవాలని, సదరు మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా రాజ్యాంగ స్ఫూర్తిగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్.ఎస్ పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినం సందర్భంగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినాన్ని ఘనంగా నిర్వహించాలన్న సూచనల మేరకు కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు జిల్లా అధికారులు తదితరులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ తదితరులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి అందరితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం ఎంతో గొప్ప ఆదర్శవంతమైన రాజ్యాంగమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిరకాలం మన ప్రజలందరి మదిలో ఉన్నారని అన్నారు. పలుమార్లు మేథోమథనం అనంతరం రాజ్యాంగం రూపొందిందని అన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26 న “సంవిధాన్ దివస్” దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, ఈ రోజున 1949లో భారత రాజ్యాంగం అంగీకరించబడిన రోజును గుర్తు చేస్తుందని, ఆ రోజు రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు మొదలు పెట్టారని, కానీ ఇది 1950 జనవరి 26 న పూర్తిగా అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు. నాటి నుండి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా అధికారికంగా మారిందని అన్నారు. కాలానుగుణంగా మన రాజ్యాంగంలో సవరణలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయని తెలిపారు.

నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు, ప్రజా ప్రతినిధులు రాజ్యాంగ ప్రవేశిక చదివి ప్రతిజ్ఞ చేయడం జరుగుతోందని తెలిపారు. రాజ్యాంగ ప్రవేశికలోని ప్రతి పదం ఎంతో మహోన్నతమైన భావజాలాన్ని కలిగి ఉన్నదని, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మనం ప్రజాసేవలో రాజ్యాంగ స్పూర్తిగా పనితీరు ఉండాలని పేద ప్రజల అభ్యున్నతికి వారి సంక్షేమానికి అభివృద్ధికి మనసా వాచా కర్మణా బాధ్యతగా అంకితభావంతో పనిచేయాలని పేర్కొన్నారు రాజ్యాంగంలోని ప్రతి పదం ఒక ఉన్నతమైన ఆశయాన్ని సూచిస్తుందని తెలిపారు.

జెసి మాట్లాడుతూ రాజ్యాంగ ప్రవేశిక ఆమోదం పొందిన నేటి రోజున ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రజాసేవలో భారత రాజ్యాంగ స్ఫూర్తి అమలుకు అన్ని స్థాయిల్లో అధికారులు పనిచేయాలని, మన దైనందిన జీవితంలో రాజ్యాంగ స్ఫూర్తితో జీవించాలని కోరారు.

జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ రాజ్యాంగ ప్రవేశిక దినాన్ని మన జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *