-రాష్ట్రంలో పర్యటక అభివృద్ధికి కేంద్ర సహకారం అత్యవసరం
-జాతీయ పర్యటక విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయగలరు
-ప్రసాద్ స్కీమ్ ద్వారా అరసవల్లి, మంగళగిరి క్షేత్రాలు అభివృద్ధికి సహకరించగలరు
-ఢిల్లీలో కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసి రాష్ట్ర పర్యటక ప్రాజెక్టులపై చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిచే పర్యటక ప్రాజెక్టులకు కేంద్రం తగిన విధంగా సహకరించి, వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఉప ముఖ్యమంత్రివర్యులు సమావేశం అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్ పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం షెకావత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన పర్యటక రంగ ప్రాజెక్టుల గురించి చర్చించారు. కేంద్ర పథకాల సహాయంతో రాష్ట్ర పర్యటక రంగ అభివృద్ధికి సంబంధించి అంశాలను కేంద్ర మంత్రి ఎదుట ఉంచారు. ఈ సందర్భంగా షెకావత్ కి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ రకాల పర్యటక ప్రాజెక్టులు, సర్క్యూట్ ల గురించి వివరించారు. వాటికి సంబంధించిన నిధుల విడుదల, భవిష్యత్తులో సహకారంపై కూలంకషంగా చర్చించారు. షెకావత్ గారు సానుకూలంగా స్పందించారు. కేంద్రం నుంచి తగిన మద్దతు, ప్రోత్సాహం, సహకారం ఎల్లపుడూ ఉంటుందని పవన్ కళ్యాణ్ కి హామీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి షెకావత్ తో చర్చించిన వివిధ ప్రాజెక్టులు ఇవీ…
• గండికోట, అఖండ గోదావరి, సూర్యలంక బీచ్ లకు ప్రత్యేక నిధులు:
అక్టోబరులో కేంద్ర పర్యటకశాఖ ‘స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్ క్యాపిటల్ ఇన్విస్టిమెంట్ (సాస్కి)’ ప్యాకేజీ కింద రాష్ట్రం ప్రతిపాదించిన గండికోట, అఖండ గోదావరి, సూర్యలంక బీచ్ లకు రూ.250 కోట్లను వెంటనే విడుదల చేయగలరు. ఈ నిధుల ద్వారా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించే ఏర్పాట్లు వెనువెంటనే ప్రారంభం అవుతాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కీలకమైన ప్రాజెక్టులను తగిన విధంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పర్యటకులనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ పర్యటకులను ఆకర్షించవచ్చు. ప్రస్తుతం పర్యటకం మీద దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి పెరిగిన దృష్ట్యా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటక ప్రాంతాలను అభివృద్ధి ఎంతైనా అవసరం.
• స్వదేశ్ దర్శన్ 2.0 ప్రోగ్రాం పరిధిలోకి మూడు ప్రాజెక్టులు
స్వదేశ్ దర్శన్ 2.0 ప్రొగాం కింద రాష్ట్రం నుంచి 4 ప్రాజెక్టులను ప్రతిపాదించగా దానిలో మూడు ప్రాజెక్టులకు కేంద్రం మంజూరు చేసింది. స్వదేశ్ దర్శన్ 2.0 ద్వారా ఈ మూడు ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని వివరించారు.
* అరకు – లంబసింగి : ఈ ప్రాజెక్టును ఎకో టూరిజం, అడ్వెంచర్ కేటగిరిలోకి వచ్చే పర్యటక ప్రాజెక్ట్. ప్రకృతి సోయగాల ఆస్వాదన, సాహసాలతో కూడిన ట్రెక్కింగ్, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేయవచ్చు.
* కోనసీమ : కేరళ తరహాలో గోదావరి బ్యాక్ వాటర్ ను ఉపయోగించుకొని ఇక్కడ పర్యటకుల్ని ఆకర్షించే ప్రాజెక్టు ఇది. కోనసీమ సంస్కృతి, సంప్రదాయం తెలుసుకొంటూ, ప్రజలతో ప్రత్యక్ష మమేకవుతూ వారి ఆతిథ్యం స్వీకరించేలా ఏర్పాట్లు చేయనున్నారు. కేరళలో కనిపించే హౌస్ బోట్లు, నది తీరంలో చక్కటి వసతి ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో పాటు కోనసీమ వాసుల ఆతిథ్యం ప్రత్యేకతగా ప్రాజెక్టును అందంగా తీర్చిదిద్దనున్నారు.
* శ్రీశైలం : ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యటక సెక్టార్ లో శ్రీశైలం అభివృద్ధి చేయనున్నారు. స్వామి వారి ఆలయానికి అనుసంధానంగా నల్లమల అడవుల్లో అందమైన కాటేజీలు, సఫారీ, ట్రెక్కింగ్ లతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాలను దీనిలో ఉంచనున్నారు.
* ప్రసాద్ స్కీంలోకి అరసవల్లి, మంగళగిరి ఆలయాలు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రసాద్ (ప్రిలిగ్రిమెజ్ రెజువెనేషన్ అండ్ స్పిరిట్యువల్, హెరిటేజ్, ఆగ్మెంటేషన్ డ్రైవ్) స్కీంను రాష్ట్రంలోని అరసవల్లి, మంగళగిరి ఆలయాలకు అమలు చేయాలని కోరారు. వీటిని ప్రసాద్ స్కీంలో చేర్చడం ద్వారా ఉత్తరాంధ్ర, అమరావతి రీజియన్లలో కీలకమైన ఆలయాలకు కొత్త కళ వస్తుంది. సౌకర్యాలు పెరుగుతాయి. భక్తులు, పర్యటకులు పెరుగుతారు. దీంతో పాటు స్థానికులకు ఉపాధి పెరగడం, వారి జీవనశైలి మెరుగవుతుంది.
• పర్యటక భవన్ కు సహాయం చేయండి
రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతిలో నిర్మించ తలపెట్టిన అత్యాధునిక పర్యటక భవన్ కు కేంద్ర పర్యటక శాఖ ఎంవోటీగా రూ.80 కోట్లు విడుదల చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పర్యాటక శాఖల కార్యాలయాలు దీనిలో ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు పర్యటక భవన్ లో తగిన సదుపాయాలు, పర్యాటకులకు అవసరం అయ్యే సమాచారం లభిస్తుంది. దీంతో పాటు రాష్ట్ర పర్యాటకం మార్కెటింగ్ చేసుకోవడానికి కేంద్రం తగిన విధంగా సహకారం అందించాలి. కేంద్రం చేసే గ్లోబల్ పర్యటక మార్కెంటింగ్ లోనూ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాల్లో ఆంధ్రప్రదేశ్ ను ప్రమోట్ చేయాలి. రాష్ట్ర పర్యాటక ప్రాజెక్టులకు చోటు కల్పించాలి.
• జాతీయ పర్యటక యూనివర్శిటీ రాష్ట్రంలో పెట్టండి
పర్యటకులను ఆకర్షించేలా, ఈ రంగాన్ని అభివృద్ధి చేసేలా విద్యార్థులకు నైపుణ్యాలను అందించే జాతీయ పర్యటక యూనివర్శిటీని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాలని కోరుతున్నాము. గ్లోబల్ లీడర్ గా ఎదుగుతున్న దేశానికి సేవ చేసే నైపుణ్యవంతులైన యువతను తీర్చిదిద్దే అవకాశం రాష్ట్రానికి వస్తుంది. ఎంతో చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం, విభిన్న పర్యటక ప్రాంతాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ పర్యాటక యూనివర్శిటీకి అనుకూలంగా ఉంటుంది. దీనిని పరిశీలించాలి.
• బ్లూఫాగ్ బీచ్ లుగా మార్చేందుకు సహకారం
దేశంలోనే రెండు అతి పెద్ద 974 కిలోమీటర్ల తీర ప్రాంతం రాష్ట్రానికి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 283 బీచ్ లున్నప్పటికీ రుషికొండ బీచ్ మాత్రమే రాష్ట్రంలో బ్లూఫాగ్ బీచ్ గా గుర్తింపు పొందింది. దేశం మొత్తం మీద 12 బ్లూఫాగ్ బీచ్ లను మరిన్ని పెంచేలా కేంద్రం చేస్తున్న కృషి అభినందనీయం. రాష్ట్రంలోనూ బ్లూఫాగ్ బీచ్ లుగా తీరప్రాంతాలను తీర్చిదిద్దడానికి తగిన సహాకారం అవసరం. బ్లూఫాగ్ బీచ్ లలో విదేశీ పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు పర్యావరణహితంగా, ఉపాధి మార్గంగా అవి ఎంతగానో తోడ్పడతాయి. రాష్ట్ర టూరిజం ఎకానమీ పెరగడానికి ఉపయోగపడతాయి.
ఈ భేటీ సందర్భంగా పవన్ కల్యాణ్ కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని సత్కరించి, ఆంధ్ర ప్రదేశ్ హస్త కళల విశిష్టతను తెలిపే జ్ఞాపికలు బహూకరించారు. తిరుపతిలో విడుదల చేసిన వారాహి డిక్లరేషన్ ప్రతిని అందచేశారు. గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కల్యాణ్ కి రాజస్థాన్ పగిడీని అలంకరించి, జ్ఞాపికతో సత్కరించారు. ఈ సమావేశంలో లోక్ సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.