మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సాగునీటి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పటిష్టవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీవోలు, తాసిల్దార్లు, ఇరిగేషన్ ఏఈ లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 204 సాగునీటి సంఘాలు, 27 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 2318 టెరిటోరియల్ కాన్స్టిట్యూఎన్సీస్, ఒక ప్రాజెక్టు కమిటీ ఉన్నాయని, వీటికి ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు ఓటర్ల జాబితా ఫైనలైజ్ చేసి ఒకటి రెండు కాపీలు ఎన్నికలు నిర్వహించే వెన్యూ వద్ద సిద్ధంగా ఉంచాలని, వెన్యూలు ఫైనలైజ్ చేయాలన్నారు. ఒక్కో సాగునీటి సంఘం పరిధిలో ఉన్న టెరిటోరియల్ కాన్స్టిట్యూఎన్సీలకు కలిపి ఒకే వెన్యూ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన మెటీరియల్ సేకరించి సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సాధ్యమైనంతవరకు ఏకగ్రీవం అయ్యేందుకు ఎన్నికల ప్రక్రియ నిబంధనలు ముందుగా శాసన సభ్యులకు, ప్రజాప్రతినిధులకు ముందుగా వివరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు పోలీస్ అధికారులు నిర్వహించాలన్నారు.
తొలుత రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ఏర్పాట్లు వివరించారు. డిఆర్ఓ కె. చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జల వనరుల శాఖ ఈఈ కే బాబు పాల్గొన్నారు.