మచిలీపట్నం/ఉయ్యూరు/కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం సేకరణ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలోని పలు మిల్లులు, రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ బందరు మండలంలోని సుల్తాన్ నగరంలో సీతారామాంజనేయ రైస్ మిల్లును తనిఖీ చేశారు. అదేవిధంగా ఎస్ ఎన్ గొల్లపాలెంలో రైతు సేవ కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించారు.
కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యంలోని తేమ శాతాన్ని కొలిచి నమోదు చేయడం, ట్రక్ షీట్ జనరేషన్, ధాన్యాన్ని వాహనంలో మిల్లుకు తరలించడం వంటి ప్రక్రియలు సజావుగా జరగాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ధాన్యం ఒకసారి మిల్లుకు చేరుకున్న వెంటనే అన్లోడ్ చేయించాలని లేనిపక్షంలో జాప్యం కారణంగా వాహనానికి అదనపు కిరాయి చెల్లింపు, ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఖాళీ లేని మిల్లులకు ధాన్యాన్ని పంపవద్దని సిబ్బందికి సూచించారు. ఇతర జిల్లాలలోని మిల్లులకు సైతం ధాన్యాన్ని పంపవచ్చని, అవసరం మేరకు తరలించాలని సూచించారు. ఇదే క్రమంలో ఆయన ఉయ్యూరు మండలం చినఓగిరాలలో రైస్ మిల్లుతో పాటు అదే గ్రామంలోని రైతు సేవ కేంద్రం, అదేవిధంగా కంకిపాడు మండలం పొద్దుటూరు టోల్గేట్ వద్ద బాలాజీ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉయ్యూరు ఆర్డిఓ బిఎస్ హేలా షారోన్, ఆయా మండలాల వ్యవసాయ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.