-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-సొంతూర్లోనే ఆదాయం ఆర్జించేలా యువతకు ప్రోత్సాహం
-ఎంఎస్ఎంఈలు, బీసీ కార్పొరేషన్ల ద్వారా యూనిట్ల ఏర్పాటు
-వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐటీఐ తరగతులు ప్రారంభం
-నేడు(శనివారం) సామాజిక పెన్షన్ల పంపిణీ
-మోడల్ పంచాయతీగా రాంపురం అభివృద్ధి : మంత్రి సవిత
పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
సొంతూరులో ఉండి యువత ఆదాయం ఆర్జించేలా ఎంఎస్ఎంఈలు, బీసీ కార్పొరేషన్ల ద్వారా యూనిట్లు ఏర్పాటు చేయనున్నామని, మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే బృహత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. పెనుకొండ నియోజక వర్గ వ్యాప్తంగా రూ.72 కోట్లతో ఓహెచ్ఆర్ తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేయనున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి నియోజక వర్గంలో ఐటీఐ తరగతులు ప్రారంభించనున్నామని వెల్లడించారు. పెనుకొండ మండలం రాంపురం పంచాయతీ కొండoపల్లి గ్రామంలో రూ.30లక్షలతో నిర్మించ తలపెట్టిన ఓహెచ్ఆర్ తాగునీటి ట్యాంకుకు శుక్రవారం నిర్వహించిన భూమి పూజలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. రాంపురంలో ఓఆర్ హెచ్ తాగునీటి ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, కొండoపల్లి గ్రామంలో తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. నియోజక వర్గ వ్యాప్తంగా రూ.72 కోట్లతో 147 ఓఆర్ హెచ్ తాగునీటి ట్యాంకులు నిర్మించనున్నట్లు తెలిపారు. నియోజక వర్గ వ్యాప్తంగా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందుకోసం ప్రతిపాదనలు రూపొందించి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కియా పరిశ్రమకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ట్రేడ్ ల్లో నైపుణ్యం కలిగేలా ఐటీఐ నెలకొల్పనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐటీఐ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఐటీఐలో విద్యాభ్యాసం తరవాత నియోజక వర్గానిక చెందిన యువత కియాలో సులభంగా ఉద్యోగాలు పొందవచ్చునని మంత్రి సవిత వెల్లడించారు.
మోడల్ పంచాయతీగా రాంపురం
గడిచిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన రాంపురం పంచాయతీ వాసులకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే పంచాయతీని దత్తత తీసుకున్నామని, దీనిలో భాగంగా పలు అభివృద్ధి పనులు ప్రాధాన్యతాపరంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే నియోజక వర్గంతో పాటు పంచాయతీలోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టామన్నారు. రాంపురం పంచాయతీని మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. అండగా నిలిచిన రాంపురం వాసులతో పాటు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు మంత్రి పదవి ఇచ్చిన ప్రోత్సహించిన సీఎం చంద్రబాబునాయుడు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.
పారిశ్రామిక వేత్తలుగా మహిళలు
అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబునాయుడు మహిళా పక్షపాతులని మంత్రి సవిత తెలిపారు. తమ పాలనలో మహిళల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. గడిచిన ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు అయిదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. దీనిలో భాగంగా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే బృహుత్తర కార్యక్రమానికి కూడా సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారన్నారు. ఇందుకోసం ఎంస్ఎంఈలు, బీసీ కార్పొరేషన్ల ద్వారా మహిళలతో యూనిట్ల ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది మహిళలకు టైలరింగ్ శిక్షణ అందజేసి, కుట్టుమిషన్ అందజేయనున్నామన్నారు. యువత కూడా ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు చేసే బదులు, సొంతూర్లోనే ఉండి…ఆదాయం ఆర్జించేలా స్వయం ఉపాధి పథకాలు అమలు చేయనున్నామన్నారు.
నేడు పెన్షన్ల పంపిణీ
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. అమరావతి రాజధాని, పోలవరం పనులు ప్రారంభంకానున్నాయన్నారు. ఇప్పటికే గ్రామాల్లో పల్లె పండగ పేరుతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టామన్నారు. పొలం పిలుస్తోంది పేరుతో రైతన్నలకు అండగా నిలిచామన్నారు. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఇస్తున్నామన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలతో పాటు సామాజిక పెన్షన్లు కూడా అందిస్తున్నామన్నారు. ఒకటో తేదీ ఆదివారం పడితే…ముందేరోజే సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. వచ్చే నెల ఒకటో తేదీ ఆదివారం పడుతుండడంతో, నేడు(శనివారం) పెన్షన్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఏదైనా పని ఒత్తిడి వల్లగాని, సుదూరంలో ఉండడంవల్ల గాని పెన్షన్లు తీసుకోలేని వారు అధైర్యపడొద్దని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. ఒకేసారి రెండు మూడు పెన్షన్లు తీసుకునేలా సీఎం చంద్రబాబునాయుడు ఉత్తర్వులు జారీచేశారన్నారు.
పంచాయతీలకు నిధుల వరద
జగన్ రెడ్డి పాలనలో పంచాయతీలు దివాళా తీశాయని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. పోయిన బల్బు కూడా మార్చుకోలేని దుస్థితిలో సర్పంచులు ఉండేవారన్నారు. చివరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా జగన్ పక్కదారి పట్టించారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తరవాత పంచాయతీలకు నిధులు వరదలా వచ్చి పడుతున్నాయన్నారు. గడిచిన 5 నెలలలో కాలంలోనే వేల కోట్ల రూపాయలను పంచాయతీలకు అందజేశారన్నారు. రాబోయే కాలంలోనూ ఇదే రీతిలో పంచాయతీలకు నిధులు అందజేయనున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.