-వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంతవరకు రాష్ట్రానికే పరిమితమైన అవినీతి సామ్రాట్ జగన్, అమెరికా లాంటి దేశాలు విస్తుపోయేలా విశ్వవ్యాప్తమైపోయారని వైద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడని జగన్ ఓడిపోయాక పదేపదే మీడియా సమావేశాలు పెట్టి పచ్చి అబద్ధాల్ని చెబుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ (డిఆర్‌సి) సమావేశం శనివారం నాడు విజయవాడ, ఇరిగేషన్ కాంపౌండ్లోని రైతు శిక్షణా కేంద్రంలో జరిగింది. సమావేశం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ అవినీతిపరుడైన జగన్ ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు నానా తంటాలు పడుతున్నారని, 11 సీట్లకు పరిమితం చేసి, ప్రజలు బుద్ధి చెప్పినా ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఆయన ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకుని నిర్మాణాత్మక పాత్ర పోషించాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్, ఐదేళ్ల కాలంలో కేవలం 16 శాతం మాత్రమే పనులు పూర్తి చేశారన్నారు. 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2 వేల మంది అధ్యాపకుల కొరత ఉందన్నారు. ఐదేళ్లలో వైద్య ఆరోగ్య శాఖలో 52 వేల మందిని నియమించిన విషయం నిజమేనని జగన్ నిరూపించగలిగితే తాను బహిరంగ క్షమాపణ చెప్తానని మంత్రి సత్య కుమార్ సవాల్ విసిరారు. వైద్యకళాశాలల్లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ పోస్టుల్ని భర్తీ చేయకపోవడం వల్ల వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ ఓలు, పారామెడికల్ సిబ్బంది పోస్టులు కూడా భారీ ఎత్తున ఖాళీలున్నాయన్నారు. పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీగా ఉండగా, జీరో వేకన్సీ విధానమంటూ హడావుడి చేశారన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల కొరత 59 శాతం జగన్ హయాం నుండీ ఉందని, 4 శాతం మాత్రమే ఉందని ఆయన అబద్ధాలు చెబుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. జగన్ అబద్ధాలు చెబుతున్నారని, తాను చెప్పిన విషయాలు తప్పు అని జగన్ కానీ, అతని మంత్రి వర్గంలో పనిచేసిన సంబంధిత మాజీ మంత్రులు కానీ బహరంగ చర్చకు రావాలని పలుమార్లు సవాల్ విసిరానన్నారు. తప్పు అని నిరూపించగలిగితే తాను జగన్‌కి బహిరంగ క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. బహిరంగ చర్చకు రమ్మంటే రాకుండా ఎందుకు పారిపోతున్నారని మంత్రి ప్రశ్నించారు. బుడమేరు వరద బాధితులకు 98 శాతం మేర రికార్డు స్థాయిలో పరిహారాన్ని ప్రభుత్వం అందించిందని, ఇంకా అందని 2 శాతం మందికి సంబంధించి రీసర్వే చేసి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు.