-రైతు శిక్షణ కేంద్రంలో జిల్లా జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశం
-జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లేందుకు కృషి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అర్బన్ ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల్లో నెలకొన్న వాటర్, డ్రైనేజీ సమస్యలతోపాటు ఆ ప్రాంతాల సత్వర అభివృద్దికి, సమస్యల తక్షణ పరిష్కారానికి గ్రేటర్ విజయవాడ ఒక్కటే మార్గమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. శనివారం విజయవాడ, ఇరిగేషన్ కాంపౌండ్‌లోని రైతు శిక్షణ కేంద్రంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్‌లు తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ డా. జి.లక్ష్మీశా, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, హెచ్ఎం, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్ తదితరులతో కలిసి జిల్లాలో 34 శాఖల పరిధిలోని అభివృద్ధి పనులు, కార్యక్రమాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ నగరంలోని పలు సమస్యలతోపాటు, జిల్లాలోని సమస్యలు ఇన్ చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ లక్ష్మీశ దృష్టి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ విధానంతో కలిగే ప్రయోజనాలను ప్రస్తావించారు.. ఈ అంశంపైనా చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. విజయవాడ అర్బన్ ప్రాంతంలో ఏ శాఖకు సంబంధించి అయినా ఓ ప్రాజెక్టు చేపట్టినప్పుడు ప్లానింగ్ దశలోనే సమన్వయ శాఖల సమావేశాలు నిర్వహించడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలోని అధికారులు చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. మరింత చురుగ్గా అధికారులు పనిచేయటానికి కావాల్సిన సహకారం తమవైపు నుంచి అందిస్తామని ప్రజాప్రతినిధుల తరుఫున ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు.
విజయవాడలో ఎన్నో ఏళ్లుగా పలు కాలేజీల్లో , పాఠశాలల్లో సీనియర్ సిటీజన్స్, యువకులు వాకింగ్ చేసుకోవటం అలవాటు. అయితే గత ప్రభుత్వం లో కరోనా సాకు చూపి కొన్ని కాలేజీల్లో వాకింగ్ చేసుకోవటానికి అభ్యంతరాలు వ్యక్తం చేయటమే కాకుండా రాకుండా అడ్డుకుంటున్నారని ఈ విషయం పై దృష్టి పెట్టి వాకింగ్ కాలేజీల్లో అనుమతి లభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ లక్ష్మీశ ను ఎంపి కేశినేని శివనాథ్ కోరారు.
సెంట్రల్ స్కీమ్ పి.ఎమ్ సూర్య ఘర్ రాబోయే మార్చి లో పూర్తికానుంది. ఈ పథకాన్ని వినియోగించుకునే విధంగా కృషి చేయాలని సంబంధిత అధికారులకి సూచించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వచ్చే డిఆర్సీ సమావేశ సమాయానికి అమలు చేసే విధంగా అధికారులు పని చేయాలన్నారు.
ఈ సమావేశం అనంతరం మీడియాతో ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ జిల్లాఅధికారులు, ఎన్టీఆర్ జిల్లా లోని ఏడు గురు ఎమ్మెల్యేలు, కలిసి కట్టుగా పనిచేసి… ఇన్ చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో ఎన్టీఆర్ జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా అభివృద్దిని కాంక్షిస్తూ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి గా డిస్ట్రిక్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించిన సత్య కుమార్ యాదవ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కొలికపూడి శ్రీనివాసరావు, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), వసంత కృష్ణ ప్రసాద్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు