-ఆంధ్రపదేశ్ ఫైబర్ నెట్వర్క్ ఛైర్మెన్ జి.వి. రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేద, మద్య తరగతి ప్రజలకు ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్స్, ల్యాండ్ ఫోన్ లను అతి తక్కువ ధరకే ఏపి ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు.
శనివారం స్థానిక రేణిగుంట విమానాశ్రయం దగ్గర ఏపీ ఫైబర్ నెట్వర్క్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవి రెడ్డి మీడియా ప్రతినిధులతో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్వర్క్, కేబుల్ కనెక్షన్లు, ల్యాండ్ ఫోన్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 2019 లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం రూ.199 రూపాయలతో 10 లక్షల ఇంటర్నెట్, ల్యాండ్ ఫోన్, కేబుల్ కనెక్షన్ సదుపాయం కల్పించారని తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రానున్న రోజుల్లో 50 లక్షల ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నామని అన్నారు. జియో , ఎయిర్టెల్ నెట్వర్కుల కంటే కూడా ఫైబర్ నెట్వర్క్ ద్వారా నాణ్యమైన సేవలు వినియోగదారులకు అందించేల కృషి చేస్తున్నామని తెలిపారు. నెట్వర్క్ సమస్యలు, సెటప్ బాక్స్ సమస్యలు తలెత్తితే త్వరితగతిన పరిష్కరించేలా సర్వీస్ సెంటర్లని ఏర్పాటు చేసి కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడుతామన్నారు. అతి తక్కువ ధరకే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నిటిని కూడా ఫైబర్ నెట్ ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. తిరుమల శ్రీవారికి తాము చేయగలిగిన సేవలో భాగంగా టీటీడీ సంస్థలకు ఫైబర్ నెట్ సదుపాయాలను కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని సంప్రదించి తగు చర్యలు చేపడతామని తెలిపారు.