-ఫెయింజల్ తుపాను కారణంగా రైతులకు అందుబాటులో ఉండాలి-
మత్స్యకారులు తుపాను ప్రభావం తగ్గే వరకు వేటకు వెళ్లకుండా చర్యలు-
-తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అధికారులు సెలవు పెట్టవద్దు –
-కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫెయింజల్ తుపాను కారణంగా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులందరూ రైతులకు అందుబాటులో ఉండాలని, తుపాను సమయంలో రైతులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. తుపాను తీవ్రత, తాజా పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. తీరప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తుపాను ప్రభావం తగ్గే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో తుపాను తీవ్రత తగ్గిన వెంటనే చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు రైతులకు తెలియచేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, ఈదురు గాలులు, ఆకస్మిక వరదలకు అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మత్స్య శాఖల అధికారులు ఎవరూ సెలవు పెట్టకుండా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.