Breaking News

సంపద సృష్టి ద్వారా అభివృద్ధి చేస్తూ ఆ ఫలాలను తిరిగి పేదలకు అందజేస్తాం

-రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం
-సాంకేతికతను అనుసంధానం చేసి సెల్ ఫోన్ ల ద్వారా పౌర సేవలు అందజేస్తాం
-రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, గంజాయి మాఫియాలు లేకుండా చేస్తాం
-పీఎం సూర్య ఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ ప్యానల్స్ అందిస్తాం
-రాయదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇచ్చి.. అందుకు తగ్గ కార్యచరణను కూడా రూపొందిస్తాం
-రాయదుర్గం ప్రాంతాన్ని ఎడారికీకరణ కాకుండా చర్యలు తీసుకుంటాం
-జీడిపల్లి, బైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత తీసుకుంటాం..
-లబ్ధిదారులు 1, 2 నెల పెన్షన్లు తీసుకోకపోయినా మూడు నెలలు మొత్తం కలిపి ఒకేసారి చెల్లిస్తాం
-నేమకల్లు ప్రజావేదికలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అనంతపురం,  నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సంపద సృష్టి ద్వారా అభివృద్ధి చేస్తూ ఆ అభివృద్ధి ఫలాలను తిరిగి పేదలకు అందజేస్తామని, ఇదే తమ ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో శనివారం మధ్యాహ్నం లబ్ధిదారురాలు పాల్తూరు రుద్రమ్మ W/O పాల్తూరు మరిచేడప్ప ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000 రూపాయల వితంతు పెన్షన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా అందజేశారు. అనంతరం ఇందిరమ్మ కాలనీలో గ్రామస్తులతో ముచ్చటించి వారితో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటో దిగారు. తదనంతరం గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారురాలు బోయ భాగ్యమ్మ W/O బోయ ముక్కన్న ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 15 వేల రూపాయల వికలాంగుల పెన్షన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు.

ఆ తరువాత ప్రసిద్ధి గాంచిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి చేరుకుని శ్రీ ఆంజనేయస్వామి వారిని సీఎం దర్శించుకున్నారు. దేవాలయంలోని స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి ముఖ్యమంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక – పేదల సేవలో.. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. తమ్ముళ్లు హుషారుగా ఉన్నారా…. ఆడబిడ్డలూ.. ఆనందంగా ఉన్నారా అంటూ ఆప్యాయంగా పలకరించి ప్రసంగాన్ని ప్రారంభించారు. తాను ప్రతిపక్షనేతగా ఏప్రిల్ 11వతేదీన అనంతపురం జిల్లాలోని కనేకల్లుకు వచ్చాను. తిరిగి మరల ఈరోజు వచ్చాను. ఆరోజు నేను 11న వచ్చినందుకు ఈరోజు మీరు ప్రతిపక్షానికి 11 సంఖ్యనే ఇచ్చి కూటమి సర్కారును అధికారంలోకి తీసుకువచ్చారు. ఆరోజు గ్రామలకు మంచి రోజులు వస్తాయని, మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని, భూకబ్జాలు చేసే వారి భరతం పడతానని ఆనాడు హామీ ఇచ్చాను. రాయలసీమను రాళ్ల సీమ కాదు రతనాలసీమగా చేస్తామని చెప్పాను. మీ ఆశలు ఏ ప్రభుత్వం నెరవేస్తుందో ఆ ప్రభుత్వానికే మీరు పట్టం కట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 93 శాతం స్ట్రైకింగ్ తో, 57 శాతం ఓట్లు వేసి కూటమి సర్కార్ ను గెలిపించారు. ఆ ఘనత మీకే దక్కిందన్నారు.

అనంతపురం వెనుకబడిన జిల్లా అని, అందులో రాయదుర్గం ప్రాంతం మరింత వెనుకబడి ఉందని, ఈ రాయదుర్గం ప్రాంతం ఎడారికీకరణ మారిపోకుండా ఉండడానికి రాయదుర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకొని మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. హంద్రీనీవాపై 4,500 కోట్లు ఖర్చుపెట్టాం, రాయలసీమలో 12,500 కోట్లు ఇరిగేషన్ పై ఖర్చు పెట్టామని, భైరవాణితిప్పకు సంబంధించి 968 కోట్లు మంజూరు చేసి 35 శాతం పనులు పూర్తి చేశామని, మిగిలిన వాటన్నిటిని పూర్తిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మీ ఊరు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాకు ఆత్మస్థైర్యాన్ని, శక్తిని, ధైర్యాన్ని, తెలివితేటలు ఇవ్వమని మీ ఊరి ఆంజనేయస్వామిని ప్రార్థించానన్నారు. పేదల పక్షాన ఉండాలని ఎప్పుడూ నా ఆలోచన ఉందన్నారు. కష్టాల్లో ఉన్నవారికి పూర్తిగా అండగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను నెలకు 3,000 నుంచి 4 వేలకు పెంచి ఏప్రిల్, మే, జూన్ నెలల అరియర్స్ తో కలిపి అందించామన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లను ఇస్తున్నామని, ఐదు నెలల కాలంలో 18 వేల కోట్లు పేదలకు ఇవ్వడం ద్వారా నా జీవితం ధన్యమైందన్నారు. 64 లక్షల మందికి నెలకు 2,790 కోట్లు ఖర్చు చేస్తున్నామని, సంవత్సరానికి 53,099 కోట్లు పింఛన్లపై తమ ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నామన్నారు. లబ్ధిదారులు 1, 2 నెల పెన్షన్లు తీసుకోకపోయినా మూడు నెలలు మొత్తం కలిపి ఒకేసారి చెల్లిస్తామన్నారు. పింఛన్ దారు ఎవరైనా చనిపోతే వారి భార్యకు కూడా వెంటనే పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల ప్రకారం పెన్షన్లు ఇస్తున్నామని, అలా పేదవారికి సహాయం చేస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రం ఇచ్చినంత విధంగా పెన్షన్లు ఇవ్వడం లేదని, కర్ణాటకలో 1,200, కేరళలో 1,600, ఒరిస్సాల 700, తెలంగాణలో 2,000, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో వెయ్యి రూపాయలు చొప్పున పెన్షన్లు ఇస్తున్నారని, కానీ తాను అన్ని రాష్ట్రాల కన్నా అధికంగా పెన్షన్లను ఇస్తున్నానని, ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలన్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగుల మాదిరిగానే ప్రతినెలా ఒకటవ తేదీనే పెన్షన్లను అందించే ఏర్పాటు చేశామని, ఒకటో తేదీ సెలవు రోజు ఉన్న కారణంగా ముందు రోజే 30వ తేదీనే పెన్షన్లను మీ ఇంటి వద్దకు వచ్చి అందించామన్నారు. రాబోయే రోజుల్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి నేరుగా లబ్ధిదారులకు తాను ఫోన్ చేస్తానని, ఆలస్యంగా ఇచ్చే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పింఛన్ల పంపిణీ బాధ్యతగా చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించానని, పింఛన్ల పంపిణీ అవినీతి రహితంగా చేయాలని, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించి పింఛన్లను అందజేయాలని ఆదేశించామన్నారు. అందుకే ఈ కార్యక్రమానికి పేదల సేవలో అని నామకరణం చేశామన్నారు.

గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, విధ్వంస పాలన చేశారని, తవ్విన కొద్ది అవినీతి, అప్పులు కనబడుతున్నాయని, 10 లక్షల కోట్లు అప్పు చేశారని, అయినా కూడా నెల నెల జీతాలు ఇచ్చేవారు కాదన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చి మద్యాన్ని 25 సంవత్సరాలు తాకెట్టు పెట్టి అప్పులు తీసుకువచ్చారన్నారు. చాలా దుర్మార్గమైన పనులు చేశారని, ఎమ్మార్వో కార్యాలయాలను, ఆసుపత్రులను సైతం తాకట్టు పెట్టారన్నారు. నాకున్న అనుభవంతో మళ్ళీ రాష్ట్రాన్ని గట్టి ఎక్కిస్తామన్నారు. ఇందుకోసం ఆరు నెలలుగా శ్రమిస్తున్నానని, ముఖ్యమంత్రి అయ్యాక తొలి 5 సంతకాలలో ఒకటి డీఎస్సీ ఫైల్ పై సంతకం పెట్టానని, త్వరలో పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు. రెండవది పింఛన్ల పెంపు చేశామని, అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, పేదలందరూ అతి తక్కువకే ఐదు రూపాయలకే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కడుపు నిండా తింటున్నారని, రాష్ట్రంలో ఇప్పటికే 195 అన్న క్యాంటీన్లు ప్రారంభించి ఒక కోటి 25 లక్షల మందికి ఆహారం అందజేసిన ఘనత మాకు దక్కుతుందన్నారు. ఏ ఆడబిడ్డ కష్టపడకూడదని గతంలో మా ప్రభుత్వంలో ఉచితంగా దీపం గ్యాస్ కింద కనెక్షన్లు ఇచ్చామని, ప్రస్తుతం దీపం టు పథకం కింద మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నామని, మీ ఖర్చు తగ్గించాలని ఆదాయం, జీవన ప్రమాణాలను పెంచాలని ముందుకు వెళ్తున్నామన్నారు. ఇందుకోసం ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. మీరు ముందస్తుగా చెల్లించే సొమ్మును కూడా ప్రభుత్వమే చెల్లించే యోచనలో ఉందని, ప్రస్తుతం మీరు చెల్లించిన మొత్తాన్ని తిరిగి 48 గంటల్లోనే మీ ఖాతాలోకి జమ చేస్తున్నామన్నారు. ఇప్పటికే 55 లక్షల మంది గ్యాస్ బుక్ చేసుకుని, 2,684 కోట్ల రూపాయలు ఈ పథకానికి ఖర్చు చేస్తున్నామన్నారు. రైతుల మేలు కలిగేలా ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసామని, భూ కబ్జాల నిరోధనకు ఆంటీ ల్యాండ్ గ్రాబింగ్ ఆక్ట్ తీసుకొచ్చామన్నారు. మీ భూమి జోలికి వస్తే వారి తాట తీస్తామన్నారు. భూ రికార్డులు కూడా గత పాలకులు ఇష్టానుసారంగా మార్పు చేశారన్నారు. తనకు అందే అర్జీలలో 40 నుంచి 50 శాతం పిటిషన్లు భూ సమస్యలపైనే వస్తున్నాయన్నారు. గత పాలకులు మధ్యాన్ని కూడా ఆదాయంగా మార్చుకున్నారని, ఇప్పటికే మీరు చూస్తున్నారు మద్యంపైన చెక్ పెట్టి దానిని కూడా ప్రభుత్వ ఆదాయంగా మారుస్తున్నామని, నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామన్నారు.

మద్యం తయారీ నుంచి షాపులలో అమ్ముకునే వరకు వారి మనుషులని పెట్టి వచ్చినంత దోచుకున్నారన్నారు. మద్యం ధరలు రేషనలైజేషన్ చేసి నాణ్యమైన మద్యం ఇస్తున్నామని, ప్రస్తుతం ప్రభుత్వానికి ఆదాయం పెరిగే పరిస్థితి వచ్చిందని, ఆ ఆదాయం సంక్షేమ కార్యక్రమాలకే ఉపయోగపడుతుందన్నారు. మద్యం దోపిడీకి అడ్డుకట్ట వేసామని, ఎవరైనా సరే ఎక్కడైనా బెల్టు షాపులు పెడితే తాను కూడా బెల్టు తీస్తానని స్పష్టంగా చెప్తున్నామన్నారు. మద్యం జోలికి ఎవరు రావద్దని, ఏ నాయకుడు, దందాలు చేసేవారు ఇందులో ఇన్వాల్వ్ అయితే ఎవ్వరిని ఉపేక్షించమన్నారు. ఇసుక ప్రకృతి ఇచ్చిన వరమని, దీనిని కూడా గత ప్రభుత్వం వ్యాపారం చేసుకొని దందాలు చేసి వేల కోట్లు సంపాదించుకున్నారన్నారు. 45 లక్షల మంది భవన కార్మికులు ఉపాధి లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందన్నారు. మీ ఊర్లో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లండని, ఎవరైనా అడ్డు చెబితే భయపడకండని, ఇసుక ప్రజలందరిదని, ఎద్దుల బండి ట్రాక్టర్లు తీసుకెళ్లి ఉచితంగా ఇసుకను తెచ్చుకోండని, ఆ స్వేచ్ఛను మీకిచ్చామన్నారు. ఇంకొక వైపు గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా గంజాయి పంట ఎక్కువగా సాగయ్యేదని, పిల్లలకు డ్రగ్స్ అలవాట్లు చేశారని, విశాఖపట్నంను గంజాయి రాజధానిగా మార్చారని, ఐదేళ్లలో ఒక్కసారి కూడా చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ఎవరైనా గంజాయి పండించినా, అమ్మినా అదే మీకు చివరి రోజు అవుతుందని హెచ్చరిస్తున్నానన్నారు. డ్రోన్స్ వస్తాయని, దానికి డేగ అని పేరు పెట్టామని, గంజాయి పండించినా, అమ్మినా, మత్తు పదార్థాలు అమ్మిన్నా ఖబర్దార్.. జాగ్రత్త డేక కన్నుతో పరిశీలిస్తున్నామని, ఆంజనేయ స్వామి సాక్షిగా హెచ్చరిస్తున్నా.. దానిపై ఒక కమిటీ వేశామని, లీగల్ ఫోర్స్ పెట్టామన్నారు. ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా గంజాయి మాఫియా లేకుండా చేస్తామన్నారు. పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే దుర్మార్గమైన పనులకు పాల్పడుతున్నారన్నారు. పేదల బియ్యం రీసైకిలింగ్ చేసే వారిని హెచ్చరిస్తున్నానని, ఎవరైనా అలాంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో చెత్త మీద పన్ను వేశారని, 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, గతంలో మా ప్రభుత్వంలో చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను తెస్తే వాటిని నిర్వీర్యం చేశారన్నారు. మా ప్రభుత్వంలో పరిశుభ్రమైన గ్రామాలు తయారు చేస్తామన్నారు. బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అని, బీసీలు అంటే ఎనలేని ప్రేమ అని ఎన్టీఆర్ చెప్పారన్నారు. చేతివృతులు, కుల వృత్తులు, వ్యవసాయ పనులు మురుగునపడి మీ జీవితంలో సమస్యలు వచ్చాయని, ఎమ్మెల్యే, ఎంపి స్థానాలను బోయ కులానికి ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 10 శాతం మద్యం షాపులని గీత కార్మికులకే కేటాయిస్తున్నామని, అర్చకులకు పదివేల నుంచి 15,000 కు జీతాలు పెంచామని, నాయి బ్రాహ్మణులకు 15,000 నుంచి 25000 చేశామని, ఆలయాలకు ధూప దీప నైవేద్యాల కోసం ఐదువేల నుంచి పదివేలకు పెంచమన్నారు. చేనేతపై జీఎస్టీ ఎత్తివేసామని, చేనేతలు ఇల్లు కట్టుకుంటే 50,000 అదనంగా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చామన్నారు.

రెవిన్యూలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా కేవలం ఒక మెసేజ్ పెడితే మీకు పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. దాదాపు 150 పౌరసేవల్ని ఆన్లైన్లో పెట్టి టెక్నాలజీ ద్వారా మీకు సేవలు అందజేసే ఏర్పాటు కల్పిస్తున్నామన్నారు. మీకు పెన్షన్లు సక్రమంగా ఇచ్చారా లేదా అని తెలుసుకోవడానికి నేరుగా ఫోన్లు కూడా చేస్తామని, ఎవరైనా లంచం తీసుకుంటే అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని సేవలు ఆన్లైన్లో పెడుతున్నామని, మీకు ఫోను చేసి మీ స్పందన అడుగుతామని, వాస్తవాలు చెప్పాలని, తద్వారా మేము మెరుగులు దిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరిస్తున్నామని, వాట్సప్ మెసేజ్ పెడితే దాన్నుంచి ప్రొక్యూర్ చేస్తున్నామని, 48 గంటల్లో ఆ డబ్బులు రైతుల అకౌంట్లో వేస్తున్నామని, ఆ తర్వాత ఫోన్ చేసి వారికి సౌకర్యంగా ఉందా లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుంటున్నామన్నారు. ఆరు లక్షల మెట్రిక్ టన్నులను రైతుల నుంచి 1,400 కోట్లు విలువైన ధాన్యాన్ని సేకరించామని, గత ప్రభుత్వం 1,674 కోట్ల రూపాయలు అప్పు పెట్టారన్నారు. 90 శాతం రాయితీతో డ్రిప్పు ఇస్తామని, గతంలో దేశంలో మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత కూడా తేదాపాదేనన్నారు.

రాష్ట్రాన్ని గుంతల మయంగా చేసి వెళ్లారని, 998 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇస్తే దుర్వినియోగం చేశారని, 4,500 ఓట్లు సద్వినియోగం చేయకుండా డైవర్ట్ చేశారన్నారు. ఈ ప్రభుత్వంలో 4,500 కోట్లతో 35 వేల పనులు పూర్తి చేయాలని, సంక్రాంతిలోపు పనులు పూర్తి చేసేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు. ఆర్ అండ్ బి రోడ్ లకి 861 కోట్లు శాంక్షన్ చేసామని, మరొక 500 కోట్లు ఇస్తున్నామని, యుద్ధ ప్రాతిపదిగిన ఈ పనులు చేపడుతున్నామన్నారు. ఈ ప్రభుత్వ పని విధానాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెప్పిన పనులన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. బాబు వస్తే – జాబు వస్తుందని, ఎవరు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే ఆ పరిశ్రమకు ఎక్కువ ఇన్సెంటివ్ ఇస్తామని, దాన్ని దేశంలోనే మొట్టమొదటిగా ప్రకటించిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ అన్నానని, ప్రస్తుతం స్పీడ్ అఫ్ బిజినెస్ డూయింగ్ అంటున్నానన్నారు. నా తమ్ముళ్లకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదన్నారు. త్వరలో నైబర్హుడ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నామన్నారు. యువత అందరూ సెల్ఫోన్ ద్వారా డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తామని, యువత నాలుగు గంటలు పనిచేస్తే తల్లిదండ్రులకు గౌరవం పెరుగుతుందన్నారు. చదువుకున్న యువత మీ పరిసరాల్లోని పనిచేస్తే నాలుగు డబ్బులు వస్తాయని, కుటుంబాలు బాగుపడతాయన్నారు. మహిళలలో కూడా చదువుకున్న వారు ఉన్నారబి, ఇంట్లో పని చేసుకుంటూనే తీరిక సమయంలో ఐదారు గంటలు పని చేయగలిగితే మీరు కూడా డబ్బులు సంపాదించే అవకాశం చూపిస్తామని, ఇందుకు మీరందరూ పూర్తిగా సహకరించాలని కోరుతున్నానన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తామని, తాడిపత్రి నుంచి విదేశాలకు ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి అరటిని ఎగుమతి చేస్తున్నారు అంటే అదే తెలుగుదేశం పార్టీ దూర దృష్టి అని మీరు అర్థం చేసుకోవాలన్నారు. అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ వచ్చింది మా హయాంలోనేనన్నారు. హంద్రి నీవా, హెచ్ఎల్సి తీసుకొచ్చి నీటి కొరత తీర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. విజన్ 2047 తయారు చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు భారతదేశాన్ని 2047కు నెంబర్ వన్ గా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేదరిక నిర్మూలన కొరకు కృషి చేస్తున్నామన్నారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా నేను కుటుంబ నియంత్రణ గురించి చెప్పానని, కానీ ప్రస్తుతం యువత తగ్గుతుండడంతో… జనాభాను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామని, మన కుటుంబమే మన ఆస్తిగా తయారవుతుందన్నారు. ప్రతి కుటుంబానికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఆలోచిస్తున్నామన్నారు.

సీఎం వరాల జల్లు :
బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో 112 మందికి ఇండ్లు మంజూరు చేస్తున్నాం. అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం. కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేస్తాం. ఇంటింటికి కుళాయిలను వేసే సురక్షితమైన మంచినీరు ఇచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. ప్రస్తుతం సూర్య ఘర్ కింద ఇంట్లోనే కరెంటును తయారు చేసుకునే పరిస్థితి వస్తోందని, మీ ఇంట్లో ఉత్పత్తి అయిన విద్యుత్తు మీకు సరిపడా మిగిలినది గ్రిడ్ కు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. గ్రామంలో 759 కుటుంబాలకు సోలార్ ప్యానల్స్ పెట్టుకునే అవకాశం ఉందని, మీకందరికీ ఉచితంగా సోలార్ గ్రిడ్ పెట్టించే కార్యక్రమం చేస్తామన్నారు. ఈ గ్రామంలో 1,49,720 చదరపు అడుగుల మేర ఇళ్లపై స్థలం ఉందని, 1,379 కిలోవాట్స్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, ఇక్కడి ప్రభుత్వ భవనాలపై మరొక 32 కిలోవాట్స్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. రెస్కో కింద సంస్థను ఏర్పాటు చేసి రుణాలు అందిస్తామన్నారు. ఊరంతా సిమెంట్ రోడ్లు, మురికి కాలువలు ఉండాలని, ఎక్కడ కూడా అపరిశుభ్రమైన వాతావరణం ఉండరాదన్నారు. చెత్తను కాంపోస్టుగా తయారు చేయాలని, మరలా మీ గ్రామానికి తనిఖీకి వస్తానని, మీ గ్రామాన్ని ఒక పరిశుభ్రమైన గ్రామంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. మినీ గోకులాలు ఎన్ని కావాలన్నా ఇస్తామన్నారు.

జీడిపల్లి – బైరవానితిప్ప ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయిందని, దాన్ని పూర్తి చేస్తే చాలా వెసులుబాటు వస్తుందన్నారు. గతంలో 950 కోట్లు మంజూరు చేసి, అందులో 35 శాతం పనులు చేస్తే దానిని పక్కన పెట్టారని, దానిని పూర్తిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. నేమకల్లు – గుంతకల్లు మధ్య అయిదు టిఎంసిల సామర్థ్యంతో రిజర్వాయర్ ను మంజూరు చేస్తున్నామని, దాని ద్వారా ఈ ప్రాంత పరిసర గ్రామాలలో నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. హంద్రీనీవా 36 ప్యాకేజీలో మాల్యం- అవలదట్ల మధ్య తలపెట్టిన బ్రాంచ్ కాలువను పటిష్టం చేస్తామన్నారు. రాయదుర్గం మున్సిపాలిటీకి ఇబ్బందుల్లో ఉందని చెప్పారని, ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకుంటామన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందిస్తామన్నారు. బొమ్మనహాల్ లో 25,000 ఎకరాల్లో ఇసుక మేటలు, దిబ్బలు ఉన్నాయని, ప్రతి సంవత్సరం అర కిలోమీటర్ పెరుగుతోందని, ఇసుక మేటలు, దిబ్బలు పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతాన్ని ఎడారిగా మారకుండా పూర్తిగా నియంత్రణ చేసే చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నామన్నారు. వేదవతి హగరిలో సబ్ సర్ఫేస్లు కావాలని అడిగారని, అభివృద్ధి చేసే పనులు చేస్తామన్నారు. డి.హీరేహాల్లో పర్కులేషన్ ట్యాంకులు ఏర్పాటు చేస్తామని, నేమకల్లు- డి.హీరేహల్ మధ్యలో ఒక పారిశ్రామిక కస్టర్ తయారు చేస్తామన్నారు. బొమ్మనహల్ మండలం శ్రీధరగట్ట గ్రామానికి తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా నీరు ఇవ్వాలని కోరారని, వాటిని మంజూరు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో అక్కడి ప్రత్యేక పరిస్థితులను తీసుకొని 100 ఎకరాల నుంచి వేల ఎకరాల్లో పరిశ్రమలు తెచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇక్కడ ఇనుప ఖనిజం ఉంది, అనుబంధ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిని సాకారం చేయడానికి పెద్ద ఎత్తున ముందుకు వెళ్తామన్నారు. నేమకల్లు ఆంజనేయ స్వామి గోపురానికి సిజిఎఫ్ కింద రూ.3 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. పిల్లలు బాగా చదువు కుంటున్నారని ఈ ప్రాంతానికి బిసి రెసిడెన్షియల్ పాఠశాల కావాలని కోరారని, దానిని కూడా మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి ఒక్కరూ మీ బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించాలని, ఈ గ్రామంలో 98 శాతం మందికి అకౌంట్లు ఉన్నాయని, దానిని పూర్తిగా 100 శాతం చేయాలన్నారు. జిపిఎస్ మ్యాపింగ్ చేశామని, కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. సచివాలయం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు మరింత కృషి చేస్తామన్నారు. మీ ఇంటికే పౌర సేవలు వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తామని, సంపద సృష్టించి ఆ సంపదను పేద వాళ్లకు అందజేస్తామన్నారు.

శ్రావణమాసం శనివారాల్లో ఈ జిల్లాలో ప్రసిద్ధి చెందిన మూడు ఆంజనేయస్వామి ఆలయాలు… మురడి, నేమకల్లు, కసాపురం మూడు ఆంజనేయ స్వామి ఆలయాలను సమన్వయం చేస్తూ ఒకే రోజు దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నామని, అది కొనసాగుతోందన్నారు. మీ ఆశయాలు నెరవేర్చడానికి అనునిత్యం పనిచేస్తాం. మీలో కూడా ఒక చైతన్యం రావాలని, టెక్నాలజీని మేము తీసుకొస్తాం… దానిని మీరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేమకల్లును ఒక ఆదర్శ మోడల్ గ్రామంగా తయారు చేయడానికి ప్రతిపాదన రూపొందించాలని కలెక్టర్ ను ఆదేశిస్తున్నానన్నారు. గ్రామంలో అభివృద్ధిపై ప్రతి సంవత్సరం సమీక్షిస్తానన్నారు. నేను చూసిన గ్రామాలను రాష్ట్రంతో పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారు. మీరు చూపిన అభిమానం తిరిగి మీ అభివృద్ధికి దోహదపడేలా కష్టపడతానని తెలియజేసుకుంటున్నానని ముగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి, వారి సతీమణి కలిసి ఉన్న చిత్రపటాన్ని జ్ఞాపకంగా అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్ లబ్ధిదారురాలు భాగ్యమ్మ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి రెండు లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *