-వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. డి. శ్రీనివాస్
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయసాగులో యాంత్రీకరణ పద్ధతులను అవలంబించడం ద్వారా సమయం ఆదా, తక్కువ పెట్టుబడి ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందవచ్చు వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. డి. శ్రీనివాస్ రైతులకు తెలియచేశారు. వ్యవసాయ కళాశాల విద్యార్థినీ విద్యార్ధులు అసోసియేట్ డీన్ డా. డి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం రాజవోలు గ్రామం లో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం (NSS )కాంప్ నాల్గవ రోజు వ్యవసాయంలో యాంత్రికరణ మరియు ఎలుకల నివారణ యాజమాన్యం పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ యంత్రాల వినియోగం ద్వారా ఈ రోజు మనం చూస్తున్నట్లుగా పెద్ద ఎత్తున వ్యవసాయం చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. జిపిఎస్ -గైడెడ్ ట్రాక్టర్‌ల నుండి ఆటోమేటిక్ నీటిపారుదల వ్యవస్థల వరకు, వ్యవసాయ యంత్రాలలో పురోగతి రైతులు అన్ని స్థాయిలలో మరింత సమర్థవంతంగా, ఉత్పాదకంగా పని చేయడంలో సహాయపడుతున్నాయన్నారు.
అగ్రికల్చర్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డా.డి.సాయి గంగాధరరావు మాట్లాడుతూ యాంత్రీకరణ వలన వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని అన్నారు. మూడు నుండి నాలుగు సంవత్సరాలకొకసారి నేలను సబ్ సాయిలర్ తో దున్నుట వలన నేలలో ఉన్న పోషకాలు ఉపరితలంలోకి చేరి మొక్కకు అందుతాయని మరియు మొక్కల యొక్క వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే వివిధ యంత్రాలు ప్రదర్శిస్తూ వాటి యొక్క పని తీరు గురించి రైతులకు వివరించడం జరిగింది.
అనంతరం ఎలుకల నివారణ కై విషపు ఎర్ర తయారు చేసే విధానాన్ని ఎంటమాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా బి.అనూష రైతుల సమక్షంలో ప్రదర్శన ద్వార వివరించడం జరిగింది. ఎలుకల సమగ్ర నివారణ కై రైతులు సామూహిక విధానాలను అవలంభించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో ఎన్ ఎస్ ఎస్ ఇన్చార్జి డా. సి హెచ్. సునీత, డా. హెచ్. శ్రీనివాస్ వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, గ్రామస్తులు, రైతులు, వ్యవసాయ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, మరియు ఆర్బీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.