అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు మరియు భవననాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రహిత రహదారులే లక్ష్యంగా జరుగుతున్న మరమ్మతు పనులను తనిఖీ చేసేందుకు వరుసగా జిల్లాల్లో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పర్యటిస్తోన్నారు. ఇప్పటికే అన్నమయ్య, కడప జిల్లాల్లో పర్యటించిన మంత్రి.. రహదారుల మరమ్మతు పనుల పర్యవేక్షణలో భాగంగా నేడు పల్నాడు జిల్లా నర్సరరావుపేట మండలం పెట్లూరివారి పాలెం వద్ద రోడ్ల మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, అదే సమయంలో నాణ్యత విషయంలో రాజీపడవద్దని అధికారులకు సూచించారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి రోడ్ల మరమ్మతులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులు కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు, నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, జిల్లా ఉన్నతాధికారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సంక్రాంతి నాటికి పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ మిషన్ లో భాగంగా రూ. 861 కోట్లతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మరమ్మత్తుల పనులు చేపట్టామని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లాలో గుంతల రహిత రహదారులే లక్ష్యంగా రూ. 38.65 కోట్లతో 133 పనులకు గాను 935 కిలోమీటర్ల మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందన్నారు. పల్నాడు జిల్లాలో రాజుపాలెం నుండి అమరావతి వరకు వున్న ప్రధాన రహదారి 44.60 కిలోమీటర్ల రహదారిని రెండు లైన్ల రహదారిగా నాబార్డ్ సహాయంతో రూ. 142.80 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కృష్ణా నదిపై మాదిపాడు వద్ద పెద్ద వంతెన నిర్మాణం రూ. 60.54 కోట్లు మంజూరు చేయడంతో పాటు టెండరు ప్రక్రియ పూర్తయి పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లాలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మతుల పనులు, నూతన పీహెచ్ సీల పనులు కూడా ఆర్ & బీ ఆధ్వర్యంలోనే సాగుతున్నాయన్నారు. సేతు బంధన్ పధకం ద్వారా రైల్వే ఓవర్ బ్రిడ్జి రూ. 51 కోట్లతో బెల్లంకొండ – పిడుగురాళ్ళ మధ్య పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 2 రోడ్ల పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము (CRIF) ద్వారా రూ. 58 కోట్లతో 46 కి.మీ మేర పనులు మంజూరు చేయడమైందన్నారు. జిల్లాలో వరద నష్టం మరమ్మతుల కింద రూ. 20 కోట్లతో 226 కి.మీ మేర 70 పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నేడు రోడ్లు గుంతలమయంగా మారడంతో, అన్ని రహదారులు అద్ధ్వాన్న స్థితికి చేరాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించక పనులు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉందని, దీంతో దాదాపు రూ. 1000 కోట్లు గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులు మేము కాంట్రాక్టర్లకు అందించడంతో పనులు తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో మన రాష్ట్ర రోడ్లు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేవని, నేడు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు హేళన చేసే స్థితికి చేరాయన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3,300 కిలోమీటర్లు పిపిపి మోడల్ లో రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసామని, ఫీజిబిలిటీ ఆధారంగా 4 లైన్లు రోడ్లను నిర్మిస్తామన్నారు.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సాయంతో రాష్ట్రంలో దాదాపు రూ. 76 వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయన్నారు. ఇవన్నీ పూర్తి చేసి రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మార్చి, పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో పనిచేస్తున్నామన్నారు.
నరసరావుపేట – చిలకలూరిపేట మధ్య రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
గుంతల రహిత రహదారుల మరమ్మత్తుల పనుల పరిశీలనలో నేడు చిలకలూరిపేట నియోజకవర్గంలోని నరసరావుపేట – చిలకలూరిపేట రోడ్డును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం స్థానిక యడవల్లి గ్రామ టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు కార్యకర్తలతో మంత్రి మాట్లాడారు. అలాగే స్థానిక ప్రజలు నరసరావుపేట – చిలకలూరిపేట రోడ్డు విస్తరణపై మంత్రి దృష్టికి తీసుకురాగా.. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిలకలూరిపేటలో నియోజకవర్గంలో రూ.5 కోట్లతో 19 కిలోమీటర్ల మేర 18 పనులను చేపట్టామన్నారు. ప్రస్తుతం నరసరావుపేట – చిలకలూరిపేట మధ్య ఉన్న రోడ్డును 4 లైన్ల రహదారిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసిందన్నారు. నరసరావుపేట – చిలకలూరిపేట మార్గం రాయలసీమ వాసులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని, దీని వల్ల రాయలసీమకు దూరం కూడా తగ్గుతుందన్నారు. ఆధ్యాత్మిక కేంద్రం కోటప్పకొండకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రోడ్డును అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మార్గంలో ట్రాఫిక్ పెరగడంతో తరచుగా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న పరిస్థితి నెలకొందన్నారు.. కాబట్టి అతి త్వరలోనే ఈ రోడ్డు విస్తరణ చేపడతామని స్థానికులకు మంత్రి హామీ ఇవ్వడం జరిగింది.