-సమర్థవంతమైన సేవలు అందించేలా తీర్చిదిద్దే అంశంపై కసరత్తు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ – వార్డు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి, మరింత అర్థవంతంగా, పటిష్టంగా ఈ వ్యవస్థను తయారు చేసి ప్రజలకు ఉపయోగకరంగా నిలపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం జీఎస్‌డబ్ల్యూఎస్ పై తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. అటు గ్రామాల్లోనూ – ఇటు పట్టణ, నగర ప్రాంతాల్లోనూ సచివాలయాలు ప్రజలకు మరింత చేరువై, ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలనే దానిపైన ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. సచివాలయ వ్యవస్ధ పునర్ వ్యవస్థీకరణ ప్రధాన అజెండాగా జరిగిన మొదటి మీటింగ్ లో వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా అత్యుత్తమ ప్రజాసేవలు అందించడంతోపాటు సచివాలయ ఉద్యోగులకు కూడా ఒక క్రమబద్ధమైన ఉద్యోగ బాధ్యతలు కల్పించి ఈ వ్యవస్ధను సమర్థవంతంగా ఉపయోగించుకునే అంశంపై చర్చించారు. మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు….ఉద్యోగుల అవసరాలు, సౌకర్యాలపైనా చర్చించారు. సచివాలయ ఉద్యోగుల్లో కొందరికి ఎక్కువ పని, మరికొందరికి తక్కువ పని ఉండటం సరికాదని.. అందరికీ సమానమైన పని బాధ్యత ఉండేలా చూడాలనే ఆలోచనపై అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్థుబాటు, శిక్షణ వారికి ఇవ్వాలని సమావేశంలో చర్చించారు.
పంచాయతీలు ఎక్కువ – సచివాలయాలు తక్కువ
ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు 13,291 ఉండగా గ్రామ సచివాలయాలు మాత్రం కేవలం 11,162 సచివాలయాలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,004 గ్రామ-వార్డు సచివాలయాలు ఉండగా వీటిలో 1,19,803 మంది ఉద్యోగులను నేరుగా నియమించారు. ఇతర విభాగాల వారిని కూడా కలుపుకుంటే 1,27,175 మంది గ్రామ-వార్డు సచివాలయాల్లో ఉద్యోగులుగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీరిలో గ్రామ సచివాలయాల్లో 95,533 మంది, వార్డు సచివాలయాల్లో 31,592 మంది ఉన్నారు. వీరిలో 18 నుంచి 27 సంవత్సరాల వయసున్న ఉద్యోగులు 50,284 (39.54%) మంది, 28 నుంచి 37 సంవత్సరాల వయసున్న ఉద్యోగులు 54,774 (43.07%) మంది ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల్లో పీజీ, పీహెచ్ డీ, ఇంజినీరింగ్, వైద్య విద్య చదివిన వాళ్లు ఉన్నారు. పీజీ, ఆపైన చదివిన ఉద్యోగులు 14 శాతం, వృత్తివిద్యా కోర్సులు చదివిన వాళ్లు 31 శాతం ఉన్నారు. యువత అధికంగా ఉండే ఈ వ్యవస్ధను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. మొదటి సమావేశంలో వ్యవస్ధ పనితీరుతో పాటు పలు అంశాలపై చర్చించారు. రానున్న రోజుల్లో మరింత కసరత్తు జరిపి ప్రభుత్వం ఈ విభాగంపై ముందడుగు వేయనుంది.