-మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండి పనిచేయాలని అధికారులకు సీఎం సూచన
-జిల్లాల్లో తాజా పరిస్థితిని, సహాయక చర్యలను వివరించి అధికారులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫెంగల్ తుఫాను ప్రభావం, ప్రభుత్వ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం నిర్వహించిన సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావంతో గత 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 ఎంఎం వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఇందులో తిరుపతి జిల్లాలో 178 ఎ.ఎం, చిత్తూరు జిల్లాలో 93 ఎం.ఎం, నెల్లూరు జిల్లాల్లో 88 ఎంఎం, అన్నమయ్య జిల్లాలో 65 ఎం.ఎం వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. మొత్తం 53 మండలాల్లో తుఫాను ప్రభావం ఉందని….భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంప్ లు ఏర్పాటు చేసి ప్రజలను తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 6,824 హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని….దీనికి అవసరమైన ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి సూచించారు. వర్షం కారణంగా తడిచిన ధాన్యం ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చెయ్యాలని సిఎం సూచించారు. వర్షాల ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు.