– వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధిలో నాబార్డ్ ముఖ్యభూమిక..
– స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి పెద్దపీట..
– రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ వ్యవసాయం.. అమరావతిలో నాబార్డ్ కు ఐకానిక్ భవనం..
– కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చట్టం..
– గత ఐదేళ్లలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైంది..
– రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా రుణ ప్రణాళిక, పర్యవేక్షణ, అభివృద్ధి మరియు వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రాభివృద్ధికి నాబార్డ్ తనవంతు కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు బుధవారం విజయవాడలోని స్టాలిన్ సెంట్రల్ కాంప్లెక్స్ లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్, నాబార్డ్ ఛైర్మన్ షాజీ కెవి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో నాబార్డు విశేష కృషి చేస్తోందన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తూ ముందుకెళ్తున్నారని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.45 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో నాబార్డ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు 64 శాతం, రాష్ట్ర జీడీపీలో నాబార్డ్ 34 శాతంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమరావతికి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఉన్న నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరావతిలో నిర్మించే నాబార్డ్ శాశ్వత ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే భూమిని కేటాయించడం జరిగిందని, దేశంలోనే ఎక్కడాలేని విధంగా అన్నిరకాల సదుపాయాలతో ఒక ఐకానిక్‌లా నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయానికి పూర్వవైభవం తీసుకొస్తామని, కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టం అమలు చేస్తామన్నారు. ఫిషరీస్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలబెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఎగుమతులను మరింత ప్రోత్సహిస్తామన్నారు. డ్రోన్లతో వ్యవసాయం చేసేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఇప్పటికే 40 వేల డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. నాబార్డ్, బ్యాంకింగ్ సెక్టార్ ప్రభుత్వానికి సహకరించి రాష్ట్రాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. నాబార్డు సహాయంతో ప్రతిపాదించిన పథకాలు, ప్రాజెక్టులన్నింటినీ ప్రారంభించి మంజూరైన రుణాలను సద్వినియోగం చేసుకునేందుకు సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని సూచించారు. భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతోందని, నాబార్డ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. బ్యాంకింగ్ నెట్ వర్క్‌ను బలోపేతం చేయడానికి మరియు సమ్మిళిత బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి నాబార్డ్ విశేష కృషి చేస్తుందని, స్వయం ఉపాధిని పెంపొందించడం, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటులో నాబార్డ్ ముఖ్యపాత్ర పోషిస్తోందని తెలిపారు. నాబార్డ్ ఛైర్మన్ షాజీ కెవి మాట్లాడుతూ.. నాబార్డు ద్వారా సహాయం అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. నాబార్డు సంబంధిత శాఖలు, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీలతో నిరంతరం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం మరియు ఆర్థిక సమ్మిళితం చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ముందంజలో ఉంటారన్నారు.
నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్.గోపాల్ మాట్లాడుతూ.. గ్రామీణ భారతానికి సేవ చేయడంతోపాటు వ్యవసాయం మరియు గ్రామీణ శ్రేయస్సుకు నాబార్డ్ తన నిబద్ధతను నెరవేరుస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, సహకారశాఖ సెక్రటరీ ఎ.బాబు, ప్రభుత్వ కార్యదర్శి డి.రొనాల్డ్ రోస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం.. మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, సహకారశాఖ సెక్రటరీ ఎ.బాబు, ప్రభుత్వ కార్యదర్శి డి.రొనాల్డ్ రోస్ లను నాబార్డ్ ఛైర్మన్ షాజీ కెవి పొందూరు ఖాదీ కండువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.