మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కాలువలు, చెరువుల్లో పెరిగే నాచురకం మొక్క గుర్రపుడెక్కతో తయారైన కళాకృతులకు ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మండల సమైక్య సభ్యులకు భరోసా కల్పించారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో లేపాక్షి, ఆప్కో స్టోర్ ప్రతినిధులు, మచిలీపట్నం మండల సమైక్య సభ్యులతో సమావేశమై గుర్రపుడెక్కతో చేస్తున్న వస్తువుల తయారీ, వాటి మార్కెటింగ్ పై వారితో చర్చించారు. ఈ క్రమంలో ఆయన వారు తయారు చేసిన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇది మంచి ఉపాధిని కల్పిస్తుందని, దీనిపై ఇప్పటికే నిపుణులైన వారితో శిక్షణ ఇప్పించటం జరిగిందన్నారు. దీనిపై మరింత మందికి శిక్షణ ఇప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డి ఆర్ డి ఏ అధికారులకు సూచించారు. వస్తువుల తయారీకి అవసరమైన ముడిసరుకు (గుర్రపుడెక్క)కు కొదవలేదని, దాని సరఫరాకు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. పర్యావరణ అనుకూలమైన వస్తువులకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ఎదగాలని ఆశించారు.
వచ్చే సమావేశం నాటికి వారు తయారుచేసిన వస్తువులకు ధరలను నిర్ణయించటం, మార్కెటింగ్ కోసం ఆకట్టుకునే విధంగా ఒక పేరును (బ్రాండ్ నేమ్) ఆలోచించాలని మండల సమైక్య సభ్యులకు సూచించారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ డిపిఎం సుధాకర్, లేపాక్షి సంస్థ ఎండి విశ్వ, ఆప్కో కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, మచిలీపట్నం మండల సమైక్య మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.