-పేరెంట్స్ తప్పనిసరిగా హాజరు కావాలి
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతి పాఠశాలలో ఈనెల 7వ తేదీ మెగా పేరెంట్స్ డే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ గురువారం కలెక్టరేట్ మీకోసం హాలులో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 1363 పాఠశాలల్లో మెగా పేరెంట్స్ డే నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, అంటే విద్యార్థి ఏ సబ్జెక్టులో బాగా చదువుతున్నది, ఏ సబ్జెక్టులో వెనుకబడింది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో చర్చించడానికి ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. తద్వారా విద్యార్థుల యొక్క విద్యభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. మెగా పేరెంట్స్ డే సమావేశాలకు రావలసిందిగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఇప్పటికే ఆహ్వానం పంపడం జరిగిందని, వారి మొబైల్ కి ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలియజేయడం జరిగిందన్నారు.
కావున విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావలసిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తొలుత రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, జిల్లా కలెక్టర్ జిల్లాలో మెగా పేరెంట్స్ డే నిర్వహణ ఏర్పాట్లపై వివరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే రామారావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News