Breaking News

ఆగస్టు 3 నుంచి 8 వరకు డీపీటీ టీకా కార్యక్రమం

-ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక టీకా శిబిరాలు
-సార్వత్రిక టీకా కార్యక్రమానికి దూరంగా ఉన్న వారి కోసం
-గొంతువాపు, కోరింత ద‌గ్గు, ధ‌నుర్వాతం వంటి ప్రాణాంత‌క వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గొంతువాపు( డిఫ్తీరియా ), కోరింత దగ్గు (పెర్టురిస్‌) , ధ‌నుర్వాతం (టెటానస్) వంటి ప్రాణాంతక బ్యాక్టీరియా వ్యాధుల నుంచి పిల్ల‌లు, కౌమార ద‌శ యువ‌త‌కు సంపూర్ణ ఆరోగ్య రక్షణ కల్పించేందుకు ఆగస్టు 3 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టీకా(డీపీటీ, టీడీ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీష‌న‌ర్‌ జి. వీరపాండియన్ తెలిపారు.
సాధారణ టీకా కార్యక్రమాల్లో టీకాలు వేసుకోలేక‌పోయిన‌ పిల్లలకు ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా టీకాలు వేయ‌డ‌మే ప్రధాన ఉద్దేశమని ఆయ‌న‌ నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ స్పెష‌ల్‌ డ్రైవ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులతో పాటు పాఠశాలలకు వెళ్లని అర్హులైన పిల్లలను కూడా గుర్తించి టీకాలు వేయనున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. సార్వత్రిక టీకా కార్యక్రమం (యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్)లో భాగంగా ఐదేళ్ల‌ వయస్సులో డీపీటీ (Diphtheria, Pertussis and Tetanus-DPT) రెండో బూస్టర్, 10, 16 ఏళ్ల వయస్సులో టీడీ( Tetanus and Diphtheria-TD) టీకా ఇవ్వడం ద్వారా పిల్లలు, కౌమారదశ యువతలో ఈ మూడు ప్రమాదకర వ్యాధులపై రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుందని కమీష‌న‌ర్‌ వివరించారు. ప్రాణాంత‌క గొంతువాపు, కోరింత ద‌గ్గు, ధ‌నుర్వాతం వ్యాధుల కార‌ణంగా వ‌చ్చే అనారోగ్యం, సంభ‌వించే మ‌ర‌ణాలను టీకాతో నిరోధించ‌వ‌చ్చ‌ని క‌మీష‌న‌ర్ వివ‌రించారు.

టీకా కార్యక్రమానికి అవసరమైన వ్యాక్సిన్లు, సిరంజీలు, ఇతర సామగ్రిని ముందుగానే సిద్ధం చేయాలని, ప్రతి టీకా కేంద్రంలో అత్యవసర పరిస్థితుల కోసం అనాఫైలాక్సిస్ కిట్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి టీకా కేంద్రాన్ని సమీప ఏఈఎఫ్‌ఐ (Adverse Event Following Immunization -AEFI) నిర్వహణ కేంద్రంతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మహిళా, శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, పురపాలక శాఖలతో సమన్వయం చేసుకుని జిల్లా, మండల టాస్క్‌ఫోర్స్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. తల్లిదండ్రులకు ముందుగానే టీకాలు వేసే తేదీల సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయ‌న సూచించారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక పరిశీలకులను నియమించి కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించాలని డీఎంహెచ్‌వోలు, డీఐఓలను క‌మీష‌న‌ర్‌ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *