Breaking News

రైతులను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. నెగిటివ్ స్టేట్‌మెంట్లతో రైతులను మరింత నష్టపెట్టొద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

– పొగాకు రైతులకు కేజీకి రూ.20 సాయం.. 94 మిలియన్ కేజీల కొనుగోలుకు చర్యలు
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.188 కోట్లతో రైతులకు అండగా నిలుస్తున్నాం
– రైతులకు ఉపయోగపడే నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వాగతిస్తాం.. జగన్‌ రైతులకు మంచి చేసే మాటలు మాట్లాడాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మిత్రపక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. రాజకీయ నాయకుడిగా రైతుల శ్రేయస్సు కోరుకోవడం ప్రధాన లక్షణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు మేలు చేసే సహేతుకమైన, నిర్మాణాత్మకమైన సలహాలను ఏ రాజకీయ పార్టీ నుంచి వచ్చినా ప్రభుత్వం తప్పకుండా స్వాగతిస్తుందని తెలిపారు. అయితే ప్రభుత్వం రైతుల సమస్యలపై సక్రమంగా స్పందిస్తూ, వారికి అండగా నిలుస్తున్న సమయంలో నెగిటివ్ స్టేట్‌మెంట్లతో రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదని హితవు పలికారు.

పొగాకు రైతులను గతంలోనూ.. ఇప్పుడూ.. సక్రమంగా ఆదుకున్నది తెదేపా, కూటమి ప్రభుత్వాలేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 2014-15లో తొలిసారిగా ఎఫ్‌సీవీ పొగాకు ధరలు పడిపోయినప్పుడు కేజీకి రూ.20 చొప్పున ఆర్థిక సాయం అందించి రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 11 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని గుర్తించి గతంలో హెచ్‌డీ బర్లీ పొగాకును 25 మిలియన్ కేజీల మేర రూ.270 కోట్లతో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని మంత్రి తెలిపారు. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, బ్రెజిల్, టాంజానియా వంటి దేశాల నుంచి తక్కువ ధరలకు పొగాకు అందుబాటులో ఉండటం, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఎఫ్‌సీవీ పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అచ్చెన్నాయుడు వివరించారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, మరోవైపు పొగాకు వ్యాపారులు, కంపెనీలపై ఒత్తిడి తీసుకొచ్చి రైతుల నుంచి కొనుగోళ్లు జరిగేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కూడా ప్రభుత్వం చేసిన ప్రయత్నం సఫలీకృతమైందని చెప్పారు.

ఎన్ని ఆర్థికపరమైన ఒత్తిళ్లు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్రాన్ని ఒప్పించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పొగాకు రైతులకు కేజీకి రూ.20 చొప్పున సాయం అందించేలా చర్యలు చేపట్టాం. 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు రూ.188 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం చేశాం. అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఎఫ్‌సీవీ పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి టొబాకో బోర్డు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ రైతుల సమస్యలను సమీక్షిస్తూ, ప్రత్యేకంగా దృష్టి సారించి తగిన ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణ, కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సంప్రదింపుల ఫలితంగానే రైతులకు రూ.188 కోట్ల సాయం అందించే స్థాయికి చేరుకున్నామని స్పష్టం చేశారు. రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటుంటే జగన్‌మోహన్ రెడ్డికి ఇవేవీ కనిపించడం లేదా? అని మంత్రి ప్రశ్నించారు. నెగిటివ్ స్టేట్‌మెంట్ల ద్వారా మార్కెట్‌ను ప్రభావితం చేసి, రైతుల్లో ఆందోళన పెంచేలా వ్యవహరించడం వల్ల రైతులకే నష్టం జరుగుతుందని అన్నారు. తన వ్యాఖ్యల వల్ల రైతులు మరింత డిస్ట్రెస్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని, కనీసం ఆ విషయమైనా జగన్‌మోహన్ రెడ్డి ఆలోచించాలని సూచించారు.

రైతులకు మంచి చేసే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, అంతే తప్ప రైతులను మరింత ముంచేలా నెగిటివ్ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు హితవు పలికారు. జగన్‌మోహన్ రెడ్డి రైతులకు మంచి చేసే పని చేయాలి.. రైతులను మరింత నష్టాల్లోకి నెట్టేలా చేసే వ్యాఖ్యలకు స్వస్తి పలకాలి అని మంత్రి సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *