– ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులకు పంటల బీమాయే భరోసా
– చివరి రోజు వరకు వేచి చూడొద్దు… ఇప్పుడే నమోదు పూర్తి చేసుకోండి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని రైతులందరూ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటల బీమా నమోదును జూలై 31వ తేదీలోగా తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వరదలు, కరువు వంటి అనూహ్య పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు రైతు కుటుంబానికి ఆర్థిక అండగా నిలిచేది పంటల బీమా మాత్రమేనని ఆయన అన్నారు. ఖరీఫ్ పంటలకు బీమా నమోదు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే గడువు ఉన్నందున ఒక్క రైతు కూడా ఈ అవకాశాన్ని కోల్పోవద్దని పిలుపునిచ్చారు. రైతులు చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని మంత్రి సూచించారు. గడువు ముగిసిన అనంతరం నమోదు అవకాశం ఉండకపోవచ్చని, అందువల్ల ప్రతి రైతు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. పంట సాగు కోసం రైతు ఏడాది పొడవునా పడే శ్రమకు భద్రత కల్పించే ముఖ్యమైన సాధనం పంటల బీమా అని పేర్కొన్నారు.
రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం పంటల బీమా నమోదును సులభతరం చేసిందని మంత్రి తెలిపారు. PMFBY Crop Insurance Farmer App ద్వారా రైతులు స్వయంగా బీమా నమోదు చేసుకోవచ్చని, అలాగే కామన్ సర్వీస్ సెంటర్లు (CSC), సంబంధిత బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), గ్రామ, మండల వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో కూడా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని వివరించారు. బీమా నమోదు సమయంలో అవసరమైన పత్రాలు, భూమి వివరాలు, బ్యాంకు ఖాతా, ఆధార్ తదితర సమాచారాన్ని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. నమోదు పూర్తయిన తర్వాత రసీదు లేదా ధ్రువీకరణ వివరాలను తప్పనిసరిగా భద్రపరచుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతి అర్హ రైతు పంటల బీమా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.
రైతు ఏడాది శ్రమను కాపాడేది పంటల బీమా. కాబట్టి జూలై 31 గడువు ముగిసేలోపు ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా నమోదు చేసుకుని తమ పంటలకు పూర్తి భద్రత కల్పించుకోవాలి అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News