-మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాకు విశేష ప్రజాస్పందన చూసి ఓర్వలేకనే రెచ్చగొట్టే ధోరణి
-తెలుగుదేశం అవినీతి రికార్డంతా త్వరలోనే ప్రజల ముందు ఉంచుతాం : సెంట్రల్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉమ్మడి రమాదేవి, అలంపూరు విజయలక్ష్మి, మోదుగుల తిరుపతమ్మ, యరగొర్ల తిరుపతమ్మ, ఉద్దంటి సునీత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మున్సిపల్ కౌన్సిల్ సమావేశ నిర్వహణపై తెలుగుదేశం సభ్యులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ నగరంలో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడిన తెలుగుదేశం నాయకులు.. ప్రభుత్వం మారినా తమ తీరును మాత్రం మార్చుకోవడం లేదన్నారు. తీరా వారి అవినీతి భాగోతమంతా ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో.. సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై కనీస అవగాహన లేని విధంగా సభలో ప్రతిపక్షం వ్యవహరించిందని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. పేదలకు ఇళ్ల నిర్మాణం గూర్చి మాట్లాడే ముందు.. నగరంలో ఎంతమందికి గత తెలుగుదేశం హయాంలో ఇళ్లు నిర్మించి ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు కనీసం ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇవ్వలేదని.. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క విజయవాడ నగరంలోనే 90 వేలకు పైగా ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇందులో సెంట్రల్ నియోజకవర్గంలోనే 30వేలకు పైగా ఇళ్లు ఉన్నాయన్నారు. ఇళ్ల లెక్కలపై తాము ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కానీ టీడీపీ హయాంలో విజయవాడ నగరంలో 10వేల ఇళ్లను తాము కట్టలేమని కౌన్సిల్ లో తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపారని గుర్తుచేశారు. అంతేకాకుండా టిడ్కో ఇళ్ల అప్లికేషన్ల పేరిట నిరుపేదలను జలగల్లా దోచుకున్నారని మండిపడ్డారు. అక్రమంగా పాకలు వేసి విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారన్నారు. అటువంటి మీకు పేదలకు ఇళ్ల నిర్మాణ పథకంపై మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఉచితంగా స్థలం మంజూరు చేయడమే కాకుండా.. ఇంటి నిర్మాణానికి రూ. లక్షా 80వేలు ఉచితంగా సాయం చేస్తుందన్నారు. దీనికి తోడు మరో రూ. లక్ష వరకు బ్యాంకుల రుణం అందించడంతో పాటు.. ఉచిత ఇసుక, సబ్సిడీపై సిమెంట్, ఐరన్ అందించడం జరుగుతోందన్నారు. మెగా హౌసింగ్ గ్రౌండింగ్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందన చూసి భరించలేకనే.. తెలుగుదేశం నాయకులు ప్రజలను రెచ్చగొడుతూ కొత్త డ్రామాకు తెరదీశారని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి రికార్డంతా తమ వద్ద ఉందని.. త్వరలోనే ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు హెచ్చరించారు.