Breaking News

ఇంధన సామర్థ్యంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ!

-అత్యాధునిక సాంకేతికతలతో అందుబాటు ధరలో విద్యుత్తు
-ఏపీ ఇంధన సామర్థ్య ఉద్యమంలో భాగస్వాములవ్వాలంటూ జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ఆహ్వానం
-ఇంధన సామర్థ్యంతో పర్యవరాణనికీ మేలు
-రాష్ట్ర ఆర్థికాభివృద్ధికీ దోహదం
-పర్యావరణ హితం, నీటి నిర్వహణ, ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుపై సీఎం ప్రత్యేక దృష్టి
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్
-శాఖల వారీగా ఇంధన సామర్థ్య పెట్టుబడి అవకాశాలను గుర్తించండి
-ఇంధన శాఖను ఆదేశించిన సీఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవీన, అంతర్జాతీయ సాంకేతికతలను సత్వరమే అందిపుచ్చుకోవడం ద్వారా ఇంధన పొదుపు , సామర్ధ్యానికి సంబంధించి నిర్దేశించుకున్న భారీ లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. దీనివల్ల ఖజానాకు పొదుపుతో పాటు పర్యావరణానికీ మేలు జరుగుతుందని చెప్పారు. గ్రీన్ హౌస్ ఉద్గారాల తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. ఈ విషయంలో స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలను అనుసరించడం ద్వారా వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలను తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వానికి సహకరించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ఏపీఎస్ఈసీఎం అధికారులతో నిర్వహించిన వెబినార్లో ఆయన మాట్లాడారు. ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా హరిత ఇంధనాన్ని ప్రోత్సహించడంలో ఏపీ దేశానికే రోల్ మోడల్ గా నిలిచేందుకు కృషి చేస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఈఈ అంచనా మేరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం విద్యుత్తు డిమాండ్ 67500 మిలియన్ యూనిట్లు కాగా 25 శాతం (16875 మిలియన్ యూనిట్లు) ఆదా చేసే అవకాశం ఉందని సీఎస్ చెప్పారు. పటిష్ఠ చర్యలు చేపట్టడం ద్వారా ఇది సాధ్యమవుతుందని, తద్వారా కరెంటు బిల్లులు తగ్గి ఆర్థిక భారం తగ్గిపోతుందని తెలిపారు.
ప్రాథమిక అంచనా మేరకు ఏపీలో వ్యవసాయ డీఎస్ఎం, గ్రామపంచాయతీల్లో వీధి లైట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఏటీ, ఉజాలా వంటి వాటితో 2932 మిలియన్ యూనిట్లు ఆదా అయిందని, ఇది ఏడాదికి రూ.2014 కోట్లతో సమానమని తెలిపారు. మరో 14000 మిలియన్ యూనిట్లు పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకోసం మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన సమగ్ర మార్గసూచీని రూపొందించాలని సీఎస్ ఇంధన శాఖకు సూచించారు.
కొవిడ్ సంక్షోభం, విద్యుత్తు రంగంపై దాని ప్రభావంతో పాటు త్వరలోనే ఏపీఎస్ఈసీఎం కార్యనిర్వాహక కమిటీ సమావేశం త్వరలో జరగనుంది. ఈ క్రమంలో విద్యుత్తు రంగంలో పొదుపు చర్యలు అత్యవసరమని సీఎస్ స్పష్టం చేశారు. అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. దీంతో పర్యావరణ పరిరక్షణకు కూడా అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం స్పష్టం చేశారన్నారు. నీటి నిర్వహణ, ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా చౌక విద్యుత్తు సాధ్యమవుతుందని, పర్యావరణాన్నీ పరిరక్షించవచ్చని తెలిపారు.

ఇంధన శాఖ ఉత్తమ పనితీరు కనబరుస్తోందని సీఎస్ అన్నారు. ఇంధన సామర్థ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించడం ద్వారా అమెరికా, జపాన్, జర్మనీ, నార్వే తదితర దేశాలు ఇంధన వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయని తెలిపారు. మనం కూడా అలాంటి అత్యాధునిక సాంకేతికతలను అధ్యయనం చేసి కేంద్ర విద్యుత్తు శాఖ, బీఈఈ అండతో రాష్ట్రంలో అమలు చేయాలని సూచించారు.
బీఈఈ నివేదిక ప్రకారం దేశంలో 2031కల్లా ఇంధన సామర్థ్య రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంధన సామర్థ్యంలో రాష్ట్రానికి మంచి రికార్డు ఉన్నందున.. శాఖల వారీగా ఇంధన సామర్థ్య కార్యక్రమాల పెట్టుబడులకు ఉన్న అవకాశాలను గుర్తించాలని ఇంధన శాఖ కార్యదర్శికి సీఎస్ సూచించారు. తద్వారా ఉద్యోగావకాశాలతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధీ జరుగుతుందని తెలిపారు. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు 20 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తున్నాయని, మొత్తం డిమాండులో ఇది 32 శాతమని చెప్పారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా ఇంధన పొదుపు లక్ష్యాలను త్వరంగా చేరుకోవచ్చని తెలిపారు.
ఇంధనాన్ని ఎక్కువగా వినియోగించే పరిశ్రమల్లో పీఏటీ పథకం అమలు చేయడం ద్వారా ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపర్చవచ్చని సీఎస్ చెప్పారు. బీఈఈ ప్రాథమిక అంచనా మేరకు ఏపీలో 0.49 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ (ఎంటీవోఈ) ఇంధన పొదుపుతో రూ.3,340 కోట్లు ఆదా అయ్యాయి. 1.62 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గిందన్నారు.
ఇంధన పొదుపు చర్యలతో రూ.2432 కోట్లు ఆదా చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర విద్యుత్తు శాఖ అభినందించిందని.. ఇది శుభపరిణామమని సీఎస్ తెలిపారు. జాతీయ సంస్థలైన బీఈఈ, ఈఈఎస్ఎల్, టీఈఆర్ఐ, సీఐఐ; ఆస్కి, అంతర్జాతీయ సంస్థలు ఐఈఏ, యూఎస్ ఎయిడ్, ఓఈసీడీ వంటి సంస్థలను బీఈఈ, కేంద్ర విద్యుత్తు శాఖతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఇంధన సామర్థ్య ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ఆహ్వానిస్తోందని చెప్పారు. పరిశ్రమలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంపైనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
కొవిడ్ 19 కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రూ.1100 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని సీఎస్ చెప్పారు. త్వరలో జరగనున్న కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో శాఖల వారీగా ఇంధన సంరక్షణ సెల్స్ ఏర్పాటు, నిర్వహణపై నివేదిక అందించాలని ఇంధన శాఖను ఆదేశించారు.
ఎంఎస్ఎంఈల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు వడ్డీ చెల్లింపుల్లో ఆర్థిక సాయం అందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ సీఎస్ కు తెలిపారు. వడ్డీ చెల్లింపుల్లో కనీసం 5 శాతం సొమ్మును ప్రభుత్వమే భరించాలని, తద్వారా మార్కెట్ రేట్ల కంటే తక్కువ వడ్డీ రేటుకు ఆర్థిక సాయం అందడంతో పరిశ్రమలు ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు ముందుకు వస్తారని వివరించారు.
ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఏపీఎస్ఈసీఎం, పరిశ్రమల కమిషనరేట్ చర్యలను గుర్తించిన కేంద్రం, బీఈఈ సమగ్ర ఇంధన ఆడిట్ నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల్లో ఇంధన సామర్థ్యానికి సంబంధించి జాతీయ స్థాయిలో మార్గసూచీ రూపొందించేందుకు గాను బీఈఈ ఇప్పటికే రాష్ట్రంలోని రిఫ్రాక్టరీ క్లస్టర్లో ఇంధన ఆడిట్ చేసింది. అలాగే పప్పులు, స్పిన్నింగ్, కోల్డ్ స్టోరేజీ, ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో ఇంధన ఆడిట్ చేసేందుకు కూడా బీఈఈ నిధులు మంజూరు చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు.
వాతావరణంలో సమతుల్యం లోపించి ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల భూతాపం పెరుగుతోంది. ఇది మానవ మనుగడకే ముప్పుగా పరిగణించే అవకాశం ఉంది.ప్రపంచ వ్యాప్తంగా అత్యాధునిక , సాంకేతికతను అంది పుచ్చుకున్న అగ్ర దేశాలు అన్ని ఈ ముప్పు నుంచి బయటపడాలని నిర్ణయించున్నాయి.ఇందులో భారత ప్రభుత్వం కీలక భౌమిక పోషిస్తుందని ,ఇందులో కూడా రాష్ట్రాలన్నిట్లో ఆంధ్ర ప్రదేశ్ ముందంజలో ఉంటుందని సిఎస్ అన్నారు . ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యం ద్వారా గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించి తద్వారా వాతావరణంలో సమతుల్యం కల్పించి , భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్లమవుతామని ఆయన అన్నారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *