-నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపిన మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గాంధీనగర్ చిట్టూరి హైస్కూల్ నందు అఖిల భారత శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీమాన్ జ్వాలాపురి శ్రీకాంత్ తో కలిసి మల్లాది విష్ణు నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ శ్రీవైష్ణవ సంఘం లక్ష్యసాధనలో ముందుండాలని ఆకాంక్షించారు. అందుకు అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తామని హామీఇచ్చారు. ప్రస్తుత తరుణంలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం దేశవ్యాప్తంగా పనిచేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. బ్రాహ్మణుల ఐక్యత, సంక్షేమం కోసం ఈ సంఘం జాతీయస్థాయిలో పనిచేయాలని కోరారు. న్యాయబద్ధంగా పరిష్కారం కావలసిన సమస్యల పరిష్కారానికై కృషి చేయాలన్నారు. జాతీయ అధ్యక్షులు శ్రీమాన్ కొడవటిగంటి నరసింహాచార్యుల వారి అనుభవం, ఆలోచనవిధానం, పరిజ్ఞానం సంఘం యొక్క ఉన్నతికి దోహదపడుతుందన్నారు. శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. అనంతరం కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమాన్ వేదాంతం రంగస్వామి ఆచార్యులు, ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ యతిరాజుల వి.ఎన్.ఎల్.ఎన్.బి.బాలాజీ, గౌరవాధ్యక్షులు శ్రీమాన్ కె. శ్రీరామన్ భట్టాచార్యర్, కోశాధికారి శ్రీమాన్ అకలంకం పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.