-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహోన్నతమైన రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు దశ దిశ నిర్దేశించిన బాబా సాహెబ్ అంబేద్కర్ చిరస్మణీయులని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని.. సమసమాజాన్ని నిర్మించడానికి జీవితకాలం కష్టపడ్డారని మల్లాది విష్ణు అన్నారు. కుల, మత, లింగ, ప్రాంత, భాష వివక్ష లేకుండా దేశ పౌరులందరికీ రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు కల్పించారన్నారు. రాజ్యాంగమంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనే కాదని.. కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింబించాలన్నది ఆయన ప్రధాన ఆశయమన్నారు. ఆ మహనీయుని కృషి ఫలితంగానే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారతరాజ్యాంగం ఉన్నత విలువలు కలిగి ఉందని కితాబిచ్చారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలకు ఆచరణ రూపం ఇస్తూ.. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని మల్లాది విష్ణు చెప్పారు. విద్యా, వైద్యానికి పెద్ద పీట వేసి ఆ మహనీయుని ఆకాంక్షలను నెరవేర్చారని పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. దళితులపై దమనకాండ విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపులతో ముందుకు వెళుతూ.. దళిత ప్రజాప్రతినిధులు, అధికారులను సైతం వేధిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారని.. కక్షలు, ప్రతీకారాలతో దళిత హక్కులను హరిస్తున్నారని దుయ్యబట్టారు. శాసనసభ వేదికగా రూపొందించిన చట్టాలనే గౌరవించని పరిస్థితి చూస్తున్నామన్నారు. కనుక కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజలందరితో కలిసికట్టుగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ స్ఫూర్తితో సమ సమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకుని.. అద్భుత సమాజ నిర్మాణం కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అలంపూర్ విజయ్, అక్బర్, తోపుల వరలక్ష్మి, పేరం త్రివేణిరెడ్డి, మేడేపల్లి ఝాన్సీ, యక్కల మారుతి, వెంకటేశ్వరమ్మ, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.