Breaking News

రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా భూ హ‌క్కుకు భ‌రోసా..

– ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కెళ్లి స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం చూపుతోంది
– త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌లనూ ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో ప‌రిష్క‌రిస్తాం
– నిబ‌ద్ధ‌త‌తో సేవ‌లందించ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు అధికారుల‌పై గౌర‌వం పెరుగుతుంది
– రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్రధాన కార్య‌ద‌ర్శి ఆర్‌పీ సిసోడియా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి ఆదేశాల‌కు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా శుక్ర‌వారం నుంచి 33 రోజుల పాటు రెవెన్యూ స‌ద‌స్సులు జ‌రుగుతాయ‌ని.. రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా భూ హ‌క్కుకు భ‌రోసా క‌ల్పిస్తూ భూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతోంద‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్రధాన కార్య‌ద‌ర్శి ఆర్‌పీ సిసోడియా అన్నారు.
జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం, త‌క్కెళ్ల‌పాడు గ్రామ స‌చివాల‌యం వ‌ద్ద స్థానిక శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌), జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ త‌దిత‌రుల‌తో క‌లిసి ఆర్‌పీ సిసోడియా రెవెన్యూ స‌ద‌స్సును ప్రారంభించారు. స‌ద‌స్సులో తొలుత ముఖ్య‌మంత్రి సందేశాన్ని చ‌దివి వినిపించారు. మీ భూమి-మీ హ‌క్కు నినాదంతో భూముల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొబిహిష‌న్‌) చ‌ట్టం-2024ను ప్ర‌వేశ‌పెట్టాం.. దీనికి కొన‌సాగింపుగా జ‌న‌వ‌రి 8 వ‌ర‌కు రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నాం. ప్ర‌తి కుటుంబానికీ భూమి అనేది ఒక భ‌రోసా.. అయితే గ‌త ప్ర‌భుత్వం అయిదేళ్ల కాలంలో భూక‌బ్జాలు, రికార్డుల మార్పు, రీస‌ర్వే అంటూ క‌ష్టాలు తెచ్చిపెట్టింది.. ఈ నేప‌థ్యంలో భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ స‌ద‌స్సుల నిర్వ‌హ‌ణ తల‌పెట్టాం.. భూ స‌మ‌స్య‌ల‌పై బాధితులు ప్ర‌భుత్వం చుట్టూ తిర‌గ‌డం కాదు.. ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి స‌మ‌స్య ప‌రిష్కరించాల‌నేది మా ఉద్దేశం అంటూ ముఖ్య‌మంత్రివ‌ర్యుల సందేశాన్ని చ‌దివి వినిపించారు. అనంత‌రం సదస్సు వద్ద ఏర్పాటుచేసిన ధ్రువీకరణ పత్రాల మంజూరు, గ్రామ రికార్డుల ప్రత్యేక కౌంటర్లను సిసోడియా పరిశీలించారు.
ఈ సంద‌ర్భంగా సిసోడియా మాట్లాడుతూ గ‌తంలో ఏటా రెవెన్యూ స‌ద‌స్సులు జ‌రిగేవ‌ని.. గుర్తున్నంత‌వ‌ర‌కు 2017లో చివ‌రిసారిగా స‌ద‌స్సు జ‌రిగింద‌న్నారు. ముఖ్య‌మంత్రి ఎప్ప‌టినుంచో ఈ స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా విజ‌య‌వాడ వ‌ర‌ద‌లు వంటి కార‌ణాల వ‌ల్ల కొంత జాప్యం జ‌రిగింద‌ని.. ఇప్పుడు ఆయ‌న ఆకాంక్ష‌కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. భూమి అనేది ముఖ్య‌మైన వ‌న‌రు.. దాదాపు 60 శాతం మంది భూ సాగు ఆధారంగా జీవిస్తున్నారు.. మిగిలిన 40 శాతం మందీ ఏదో ఒక‌విధంగా భూమితో అనుసంధాన‌మై ఉన్నారన్నారు. వివిధ కార‌ణాల‌తో గ‌త కొన్నేళ్లుగా భూ స‌మ‌స్య‌లు పెరుగుతూ వ‌స్తున్నాయ‌ని.. పీజీఆర్ఎస్‌కు వ‌చ్చే అర్జీల్లో 40 శాతం అవే ఉంటున్నాయ‌ని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే ప్ర‌భుత్వం వెళ్లి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని, ప‌రిష్క‌రించే విధంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. కొన్ని స‌మ‌స్య‌లు త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం కాక‌పోవ‌చ్చు.. అయినా ప్రత్యేక ప్ర‌ణాళిక‌తో వాటి ప‌రిష్కారానికి కృషిచేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇప్ప‌టికే ప‌రిష్క‌రించిన స‌మ‌స్య‌ల‌పైనా ప్ర‌జాభిప్రాయాన్ని తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. స‌మ‌ష్టిగా స‌మ‌స్య‌ను స‌రిదిద్దుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. రెవెన్యూ స‌ద‌స్సుల్లో స్వీక‌రించిన పిటిష‌న్‌పై అధికారులు ఏరోజు క్షేత్ర‌స్థాయిలో సంద‌ర్శిస్తార‌నే విష‌యాన్ని కూడా వెంట‌నే తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. అధికారులు, సిబ్బందిపై గౌర‌వం పెరిగేలా ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాల‌ని సిసోడియా సూచించారు.

భూ స‌మ‌స్య‌లకు చ‌ర‌మ‌గీతంతో స‌మాజం బాగుప‌డుతుంది: క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
భూ స‌మ‌స్య‌ల‌కు ఫుల్‌స్టాప్ పెట్ట‌డం ద్వారా గ్రామం బాగుప‌డుతుంది.. స‌మాజం బాగుప‌డుతుంద‌నే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. చిన్న స‌మ‌స్య అయినా ప‌రిష్క‌రించ‌కుండా వ‌దిలేస్తే అది పెద్ద‌గా మారి… సామాజిక స‌మ‌స్య‌గా త‌రత‌రాల‌ను వెంటాడుతుంద‌ని పేర్కొన్నారు. పిటిష‌న్ల‌ను ఆర్‌టీజీఎస్ గ్రీవెన్స్ పోర్ట‌ల్‌లో ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దిన విండోలో న‌మోదు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. విస్తీర్ణంలో వ్య‌త్యాసం, మ్యుటేష‌న్‌, కోర్టుకేసులు.. ఇలా వివిధ స‌మ‌స్య‌ల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి, ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌జల భాగ‌స్వామ్యంతో భూ స‌మ‌స్య‌ల‌కు స్వ‌స్తిప‌లికి గ్రామాల‌ను భూ వివాద ర‌హిత గ్రామాలుగా తీర్చిదిద్దే ల‌క్ష్యంతో నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ కోరారు.

భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మంచి వేదిక‌: ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్‌
గ్రామాల్లో భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి రెవెన్యూ స‌ద‌స్సులు అనేవి గొప్ప వేదిక అని జ‌గ్గ‌య్య‌పేట శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌) అన్నారు. ప్ర‌జ‌ల ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు కూట‌మి ప్ర‌భుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేయ‌డం జ‌రిగింద‌ని, అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొహిబిష‌న్‌) యాక్ట్‌-2024ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు వివ‌రించారు. ఒక స‌ర్వే నంబ‌రులోని ప‌దెక‌రాల్లో ఎక‌రం భూమి ఎండోమెంట్ ల్యాండ్ అయితే మొత్తం ప‌దెక‌రాల‌ను 22ఏలో పెట్ట‌డం వంటి స‌మ‌స్య‌లు దృష్టికి వ‌చ్చాయ‌ని ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా ప‌రిష్కారం ల‌భించ‌నుంద‌ని తెలిపారు. ఇనాం భూములు, సీలింగ్ భూములు త‌దిత‌రాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్కారం కానున్నాయ‌ని శాస‌న‌స‌భ్యులు వివ‌రించారు.
కార్య‌క్ర‌మంలో నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ‌, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌త్యేక అధికారి కె.శ్రీనివాస‌రావు, మండ‌ల ప్ర‌త్యేక అధికారి జి.ఉమామ‌హేశ్వ‌ర‌రావు, సర్పంచ్ కె.శ్రీనివాస‌రావు, తహసీల్దార్ పి.మ‌నోహ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *