-విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల గురువుల మధ్య మంచి వాతావరణం ఏర్పాటుకు పేరెంట్ టీచర్ సమావేశాలు
-విద్యార్థుల పఠన సామర్థ్యం, వారి ఆసక్తులు, ఆరోగ్యంపై తల్లిదండ్రులకు గురువులకు అవగాహన కలిగి విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయుటకే పేరెంట్ టీచర్ సమావేశాలు
-ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం:జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగు పరుస్తోందని అందులో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్ సమావేశాలను నిర్వహిస్తోందని, తల్లిదండ్రులకు వారి పిల్లల విద్యా స్థాయి పట్ల, ఆసక్తులు పట్ల, ఆరోగ్యం పట్ల ఈ సమావేశాల్లో టీచర్లు అవగాహన కల్పించి ఒక మంచి వాతావరణం ఏర్పాటుతో వారి పిల్లల విద్యా పురోగతికి బంగారు బాటలు వేసే కార్యక్రమం ఇది అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు.
శనివారం ఉదయం శ్రీకాళహస్తి నియోజక వర్గం శ్రీకాళహస్తి మండలం తొండమనాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్ టీచర్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్డీవో శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి తదితర సంబంధిత అధికారులతో కలిసి పాల్గొని ముందుగా సరస్వతి దేవిని పూజించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా నేడు మన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం పెద్ద ఎత్తున స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మరియు అన్ని గురుకుల పాఠశాలలలో నిర్వహించుకోవడం జరుగుతోందని తెలిపారు. ఈ ముఖ్య కార్యక్రమ రూపకల్పన ఆలోచన గౌ. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు చేశారని, ఇది ఒక విశిష్ట కార్యక్రమం అని అన్నారు. విద్యార్థుల చదువు పట్ల, ఆరోగ్యం, ఆసక్తుల పట్ల అవగాహన కొరకు పాఠశాల గురువులతో తల్లిదండ్రుల భాగ స్వామ్యం ఎంతో అవసరం అని తెలిపారు. విద్యార్థుల విద్యా పురోగతి, వారి చర్యలు, వివరాలు తల్లిదండ్రుల తో గురువులు, గురువులతో తల్లిదండ్రులు విద్యార్థుల యాక్టివిటీ, విద్యా పురోగతి పై వివరాలు పంచుకోవాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ సమావేశాలు క్రమం తప్పకుండా జరుపుతారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను బయటకు వెలికి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. క్రమం తప్పకుండా పేరెంట్ టీచర్ సమావేశాలకు హాజరు కావాలని, తద్వారా విద్యార్దిని విద్యార్దులు వారి విద్యలో సబ్జెక్ట్ నందు, ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీ నందు పురోగతి వంటి వాటిపై తల్లిదండ్రులకు ఒక అవగాహన వస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్, క్రీడల్లో వారి పురోగతికి బాటలు వేయాలని కోరారు. ప్రతి ఒక్క విద్యార్థికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును అందిస్తూ, అందులో విద్యార్థి మరియు తల్లిదండ్రుల పూర్తి వివరాలను, విద్యార్థుల యొక్క హాబీలను నమోదు చేయడం ఒక గొప్ప శుభ పరిణామం అని తెలిపారు. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ లు ప్రైవేటు పాఠశాలలో జరిగేవని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో టీచర్, స్టూడెంట్ పేరెంట్స్ మధ్య మంచి వాతావరణం నెలకొల్పినట్లు అయిందని అన్నారు. పేరెంట్స్ మీటింగ్ నందు విద్యార్థుల గురించి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ద్వారా వివరించడం, విద్యార్థుల యొక్క హాబీలను కూడా తల్లిదండ్రులకు తెలియపరచడం ద్వారా విద్యార్థుల విద్యా స్థాయి సామర్థ్యాలు పెంచుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే పిల్లల ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలని తెలుపుతూ వారికి వారి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కార్డును కూడా ఈ కార్యక్రమంలో అందించారు. ఈ సమావేశాల వలన ఎవరైనా విద్యార్థులు పాఠశాలకు చాలా రోజుల నుండి హాజరుకాని పక్షంలో కారణాలను ఉపాధ్యాయులు తెలుసుకొనడానికి, అలాగే వారికి ఆరోగ్య సమస్య ఏదైనా ఉన్నచో వారికి ఆరోగ్య పరీక్షల కొరకు సదుపాయాన్ని అందించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు, పిల్లలతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు నిర్వహించడం వలన విద్యార్థుల తల్లిదండ్రులకు వారి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారని, వారి ఆసక్తి కలిగిన ఆటపాటలు, సబ్జెక్టుల వివరాలపై అవగాహన వస్తుందని అలాగే పాఠశాలలలోని డొక్కా సీతమ్మ బడి భోజన పథకం అమలు, హాజరు శాతం, త్రాగునీటి సదుపాయాలు ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలు, పిల్లల యొక్క యాక్టివిటీ తల్లిదండ్రులకు తెలుస్తుందని తెలిపారు. విద్యార్థులు లక్ష్యం ఉన్నతంగా పెట్టుకోవాలని ఆ దిశగా కృషి చేయాలని పిల్లలకు సూచించారు. మొబైల్ చూడడం వంటివి ఎక్కువ సమయం చూడరాదని, విద్యకు సంబంధించిన అంశాలు కొరకు వినియోగించాలని సూచించారు.
అదనపు గదులు మంజూరు, ఆర్వో ప్లాంట్ మంజూరు కొరకు చర్యలు తీసుకుంటామని, ఆట స్థలం కొరకు ఆర్డిఓ శ్రీకాళహస్తి స్థలం పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించారు. హాస్టల్ వసతి ఏర్పాటు, జూనియర్ కళాశాల ఏర్పాటుకు కోరగా వాటిని నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల తండ్రులతో టగ్ ఆఫ్ వార్ తాడు లాగుడు కార్యక్రమంలో కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. తల్లులు వేసిన రంగోలి ముగ్గులను పరిశీలించి విద్యార్థులు తల్లులతో మాట్లాడారు. అనంతరం పిఎంశ్రీ క్రింద ఎంపిక కాబడిన సదరు పాఠశాలలోని వసతులను పరిశీలించి పిల్లలు విద్యాపరమైన అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్ట్ లపై ముఖాముఖి మాట్లాడి పిల్లలకు వారి తల్లిదండ్రుల సమక్షంలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టులను కలెక్టర్ అందజేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో కలెక్టర్ మొక్కలు నాటారు. తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో కలెక్టర్ ఫోటో దిగారు.
ఆర్డీఓ శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్ సమావేశాల ముఖ్య ఉద్దేశ్యం పిల్లల విద్యా పురోగతిపై గురువు, తల్లి దండ్రుల మధ్య గ్యాప్ పూరించడం కొరకు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమని అన్నారు.
పూర్వ విద్యార్థులు, ఎస్ఎంసి చైర్మన్ అచ్యుతయ్య తదితరులు మాట్లాడుతూ తొండమనాడు చక్రవర్తి పాలించిన తొండమనాడు ఉన్నత పాఠశాలకు కలెక్టర్ రావడం ఎంతో సంతోషంగా ఉందని, కలెక్టర్ ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రతి విద్యార్థి విద్యార్థినీ ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ కలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు. పాఠశాలకు అనుబంధంగా అదనపు గదులు మంజూరు చేయాలని, హాస్టల్ వసతి ఏర్పాటు, జూనియర్ కళాశాల ఏర్పాటుకు కోరగా స్పందించిన కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తల్లి తండ్రి తర్వాత గురువు పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని, సదరు పాఠశాలలో గురువులు బాగా విద్యాబుద్ధులు నేర్పుతున్నారని, పేరెంట్ టీచర్ సమావేశాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేసి వారి అభిప్రాయాలు పంచుకున్నారు. స్టేషన్ హౌస్ అధికారి రవి నాయక్ సైబర్ క్రైమ్ పై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తర్వాత ప్రభుత్వ మెనూ ప్రకారం డొక్కా సీతమ్మ బడి భోజన పథకం మేరకు ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్, మండల ప్రత్యేక అధికారి మరియు జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, ఎంపిడిఓ రఫిక్, ఎంఈఓ భువనేశ్వరి, సిడిపిఓ శ్రీకాళహస్తి, పాఠశాల హెచ్ఎం కృష్ణయ్య, ఉపాద్యాయులు, సమగ్ర శిక్ష, తదితర సంబంధిత అధికారులు, తల్లి దండ్రులు, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.