మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల దూరాలను తెలిపే సూచిక బోర్దుల గోడ పత్రికను సోమవారం నగరంలో కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆవిష్కరించారు. జిల్లాలోని ముఖ్య పర్యాటక ప్రదేశాలు మంగినపూడి బీచ్, హంసలదీవి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, కూచిపూడి నృత్య కళాశాల, పెడన కలంకారి తదితర ప్రదేశాల దూరాలను తెలిపే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ బోర్డులు జిల్లా సరిహద్దు ప్రాంతం కామయ్యతోపు నుంచి ప్రారంభమవుతాయని, దీనితో పాటు పెనమలూరు సెంటర్, గోసాల, కంకిపాడు టోల్గేట్, ఉయ్యూరు, పామర్రు, కూచిపూడి, మోపిదేవి, అవనిగడ్డ, మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిలోని 216 వంతెన కింద (అండర్ బ్రిడ్జ్), మూడు స్తంభాల సెంటర్, తాళ్లపాలెం సెంటర్లలో పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇన్చార్జి డిఆర్ఓ కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, బందరు ఆర్డిఓ కే.స్వాతి, పర్యాటక శాఖ జిల్లా అధికారి జి. రామలక్ష్మణరావు పాల్గొన్నారు.