-పీహెచ్సీలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం
-రానున్న ఐదేళ్ళల్లో ప్రతి ఇంటికి తాగునీరు
-ఐటీడీఏలకు పూర్వ వైభవం తెస్తాం
-ఉద్యానవన పంటలతో పరిశ్రమల స్థాపనకు కృషి
-సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులు
-ప్రజా ప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
-సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధి సాధ్యం
-డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రజాప్రతినిధులు, జిల్లాయంత్రాంగం, అధికారుల సమిష్టి కృషి, సహకారంతో జిల్లా అభివృద్ధి సాధ్యమౌతుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 33 శాతం గిరిజనులు ఉండే ఈ ప్రాంతం పూర్తిగా పేదరికం జిల్లా అని తెలిపారు. ఇటువంటి జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యత తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. పదవులు, అధికారం శాశ్వతం కాదని, పదవీ కాలంలో చేసిన మంచి పనులే ప్రజల మదిలో చిరస్తాయిగా మిగిలిపోతాయని మంత్రి ఉద్బోదించారు. అందరి సహకారం, మంచి చేయాలనే తపన, చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలపై దృష్టి సారించడం కన్నా,స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ కనీస మౌలికవసతులు లేని గ్రామాలపై దృష్టి సారిస్తే కొంత సార్ధకత ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. జిల్లాలో ఇప్పటికీ చాలా గ్రామాలకు రహదారి సదుపాయం లేదని, ఆరోగ్యం బాగాలేకపోతే డో్లీ మోతలు తప్పకపోవడం విచారకరమన్నారు. త్వరలో అన్ని మండలాల్లోని రోడ్లు సదుపాయం లేని గ్రామాలను గుర్తించి, రానున్న రెండేళ్లలో అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడమే తన ముందున్న ధ్యేయమని అన్నారు. ఇందుకు అవసరమైన నిధులను సమకూరుస్తామని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామానికి ఆటో లేదా అంబులెన్సు వెళ్లేలా వసతులు కల్పిస్తామని, వీటితో పాటు ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించాల్సి ఉందని, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సహకరిస్తే కొంతవరకైనా మార్పు తీసుకురాగలననే నమ్మకం తనకు ఉందని ఇంచార్జి మంత్రి స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని, ఇందుకు అవసరమైన నిధుల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షించుకుంటూ, జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రారంభించి నిలిచిపోయిన పనులను ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా చేపడతామని అన్నారు. ముఖ్యంగా మధ్య, చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఇప్పటికే జిల్లాపై అవగాహన వచ్చిందని, ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి సమావేశాలు నిర్వహించడం వలన స్థానిక సమస్యలు కూడా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ద వహించి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా గుర్తుండిపోయే పనులను చేపడతామని మంత్రి వివరించారు.
పార్వతీపురం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (డిఆర్సీ) సమావేశం జిల్లా ఇన్చార్జ్ మంత్రి కె. అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి, ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయక రాజేశ్వరి, ట్రైకార్ చైర్మన్ బొరగాం శ్రీనివాసులు, ఎంఎల్సీలు ఇందుకూరి రఘురామ్, పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయ కృష్ణ, పార్వతీపురం మునిసిపల్ చైర్మన్ బి. విజయగౌరి, జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్వి.మాధవరెడ్డి, జేసీ ఎస్.ఎస్. శోబిక, సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తదితరులు భాగస్వామ్యం అయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 15 మండలాలకు గాను 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు ) 24/7 ఉన్నాయని, రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్య కేంద్రాలు ఉండటం గమనార్హమని పేర్కొన్నారు. ఇక్కడ అవసరమైన పీహెచ్సీలు ఉన్నప్పటికీ, అందులో వైద్యులు, సదుపాయాలు, మందులు ఉండాలని, రోగులు వస్తే ఆదరించే పరిస్థితి ఉండాలని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పీహెచ్సీలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, వైద్యులు, మందులు, అంబులెన్సులు వంటి సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. రక్తహీనత లోపం జిల్లాలో ఎక్కువగా ఉందని, దీనిపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఆరోగ్యం బాగాలేకపోతే డో్లీ మోతలను నివారించేందుకు ప్రతి గ్రామానికి రానున్న రెండేళ్లలో రహదారి సౌకర్యం కల్పిస్తామని, ఇందుకు అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రానున్న ఐదేళ్లలో ప్రధానమంత్రి సుజల యోజన పథకం కింద ప్రతి ఇంటికీ తాగునీటి వసతి కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. గత ఐదేళ్లలో చాలావరకు నష్టం జరిగిందని, ఇతర రాష్ట్రాల్లో లక్షా ఏభై వేల కోట్ల వరకు నిధులు వెచ్చిస్తే, గత ఐదేళ్లలో రాష్ట్రంలో 2వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసారని మంత్రి గుర్తుచేశారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మిషన్ మోడ్ లో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే కృత నిశ్చయంతో ఉన్నారని, ఈ పథకం కింద రానున్న ఐదేళ్లలో జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. జిల్లాలో ఝంజావతి, తోటపల్లి, వంశధార, ఇతర నీటి వనరులు ఉన్నాయని, వాటి ద్వారా సమగ్రంగా తాగునీటిని ఉపయోగించుకొని మన్యం జిల్లా తొలి స్థానంలో నిలవాలని, ఆ బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ఇవన్నీ పూర్తయితే జిల్లాకు ప్రధాన సమస్య తీరుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం వర్షాలపై ఆధారపడాల్సి వస్తుందిని, ఝంజావతికి అంతరాష్ట్ర సమస్య ఉందని, ఆ సమస్యను పరిష్కరించు కోగలిగి, ఎత్తిపోతల పథకాలపై దృష్టి సారిస్తే జిల్లాలో సాగునీటి సమస్య తీరుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. జిల్లాలో రెండు ఐటిడీఏలు ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, మన ప్రభుత్వంలో ఐటిడీఏలు కోలాహలంగా ఉండేవని, వాటికి పునరుజ్జీవం తీసుకువస్తామని మంత్రి చెప్పారు. లాభసాటి ఉద్యానవన పంటలతో పాటు పండ్ల పరిశ్రమలను స్థాపించి మరింత అధిక లాభాలు ఆర్జించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇక్కడ జీడీ, మామిడి, పైనాపిల్ వంటి పండ్ల రసాల తయారుచేసే పరిశ్రమలను నెలకొల్పాలని, ఇందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించి ఎంఎస్ఎంఈ లను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు.ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు తక్కువగా ఉన్నారని, పూర్తి స్థాయి అధికారులు కూడా లేరని, అందువలన అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉన్నందున, దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి వివరించారు. రూ. 850 కోట్లతో గుంతలు లేని రహదారుల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని, ఈ పనులన్నీ సంక్రాంతి నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే విద్యపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గత ఐదేళ్లలో పాఠశాలలు మూతపడ్డాయాని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17 డీఎస్సీలు జరిగితే, అందులో 11 డీఎస్సీలు ఈ ప్రభుత్వమే నిర్వహించిందని తెలిపారు. మరో 5 మాసాల్లో డీఎస్సీ తీయబోతున్నట్లు మంత్రి తెలిపారు. శ్రీకాకుళం సమగ్ర కలెక్టరేట్ భవనం మాదిరిగా జిల్లాలో కూడా కొత్త కలెక్టరేట్ నిర్మాణం జరగాలని, ఇప్పటికే కేటాయించిన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, అధికారుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామని మంత్రి ఈ సందర్బంగా వివరించారు. జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కళ్ళాల్లోని ధాన్యాన్ని తడవకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైతే మిల్లులకు తరలించాలని మిల్లు యాజమాన్యం ఉపక్రమిస్తే తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. లాభసాటి ఉద్యానవన పంటలపై రైతులు దృష్టి సారించేలా ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఏనుగుల దాడితో రైతులు పండించిన పంటలు నష్టంపోకుండా తగిన చర్యలు చేపట్టాలని డీఎఫ్ఓను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహల్లో ఉన్న పిచ్చి మొక్కలను ఉపాధిహామీ పథకం కింద తొలగించేలా చర్యలు చేపట్టాలని డ్వామా పీడీని ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో ఉన్న వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య సహాయకుల పోస్టులను సంబంధిత శాఖల పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. త్వరలో వెటర్నరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తామని, వెటర్నరీ బిల్డింగులను నాబార్డ్ నిధులతో నిర్మిస్తామని అన్నారు. జిల్లాలో సమీకృత భూసార పరీక్షా కేంద్రాన్ని, మత్స్య పెంపక కేంద్రాన్ని, జిల్లా కేంద్ర సహకార బ్యాంకును మంజూరు చేస్తామని పేర్కొన్నారు. సూపర్ – 6ను తప్పక అమలుచేస్తామని, త్వరలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తామని మంత్రి తెలిపారు. జిల్లాలో రూ. 140 కోట్లతో ఆధునిక వ్యవసాయ పనిముట్లను రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు.
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, రహదారులకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని అధికారులకు మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనల మేరకు ఇప్పటికే రహదారులతో పాటు ఇతర అభివృద్ధి పనులు గత ఆరు మాసాలుగా జరుగుతూ, జిల్లా అభివృద్ధి పథంలోకి వెళ్తుందని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో నిర్వహిస్తున్న తొలి జిల్లా సమీక్షా మండలి సమావేశమని అన్నారు. ఇది గిరిజన ప్రాంతామని, 33 శాతం మంది గిరిజనులు ఉండే ప్రాంతామని మంత్రికి కలెక్టర్ వివరించారు. ప్రకృతి సోయగాలకు, సహజ సిద్ధ అందాలకు జిల్లా నెలవని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లోని జిల్లా అధికారులను సమన్వయం చేసుకొని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ మంత్రికి తెలిపారు. ఇంచార్జి మంత్రి సూచనలు, సలహాలతో జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కృషిచేస్తామని కలెక్టర్ మంత్రికి వివరించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ కె.హేమలత, సిపిఓ పి. వీర్రాజు, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా.ఎస్.మన్మధరావు, డిపిఓ టి.కొండలరావు, జిల్లా సూక్ష్మ నీటిపారుదల అధికారి వి. రాధాకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎస్.కృష్ణ,డీఎంసీఎస్ పి.శ్రీనివాసరావు, డ్వామా పీడి కె.రామచంద్రరావు, ఐసిడిఎస్ పిడి ఎం.ఎన్.రాణి, జిల్లా ఉద్యానవన అధికారి కె.ఎస్.వరప్రసాద్, జిల్లా మత్స్య శాఖాధికారి వి.తిరుపతయ్య,జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుమలనాయుడు, ఇరిగేషన్ ఈఈ ఆర్.అప్పలనాయుడు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.విజయపార్వతి, వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి డా. ఎం.ప్రవీణ్ కుమార్, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఈఈ ఒ.ప్రభాకరరావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎండీ.గయాజుద్దీన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.