-కేంద్రానికి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి వినతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో మంగళవారం తిరుపతి ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రసిద్ధ ఆధ్మాత్మిక క్షేత్రమైన తిరుపతి, తిరుమల విశిష్టతలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ప్రతి రోజూ దేశ, విదేశాల నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో తిరుపతికి రైలు మార్గం ద్వారా వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే పారిశ్రామికంగా తిరుపతి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా, ఈ రైల్వే డివిజన్ ఏర్పాటు ఎంతో ఆవశ్యకమని ఆయన అన్నారు. రైల్వే డివిజన్ ఏర్పాటుతో తిరుపతి ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ప్రస్తుతం తిరుపతి రీజియన్‌లో రైల్వే కార్యకలాపాల నిర్వహణ వివిధ రైల్వే డివిజన్ల మధ్య విభజనకు గురైనట్టు ఆయన చెప్పారు. అందువల్ల పరిపాలన సౌలభ్యంగా లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ఆలస్యమవుతోందన్నారు. ప్రముఖ పారిశ్రామికవాడల ద్వారా ఉత్పత్రి అయ్యే సరుకు రవాణాకు సంబంధించి కూడా సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. వీటి అన్నింటిని పరిగణలోకి తీసుకుని బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన అభ్యర్థించారు.