అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ పథకం అమలు గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో వివరాలు కోరారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరు చేసిన, కేటాయించిన, వినియోగించిన నిధుల వివరాలు, రాష్ట్రంలో పథకం కింద నిర్ణయించిన లక్ష్యాలు ఏ మేరకు ఫలితాలనిచ్చాయి, రాష్ట్రంలో లక్షిత లబ్ధిదారులు ప్రయోజనాలను పొందేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు గూర్చి వివరించగలరు అంటూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి బుధవారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా సమాదానం ఇస్తూ దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ పథకం, ప్రధాన్ మంత్రీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా సుమారు 80 కోట్ల మంది లబ్ధిదారులకు దేశంలో ఏ చౌక దుకాణం (రేషన్ షాప్) నుంచి వారి హక్కులున్న రేషన్ తీసుకోవడానికి సౌలభ్యం కల్పించిందని తెలిపారు.
ఈ పథకం ద్వారా, లబ్ధిదారులు ఉపయోగంలో ఉన్నటువంటి తమ రేషన్ కార్డ్ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా దేశంలోని ఏ చౌక దుకాణం (రేషన్ షాప్) నుంచి అయినా రేషన్ తీసుకోవచ్చని అన్నారు. ఈ సౌకర్యం వలన ముఖ్యంగా వలస కార్మికులకు లబ్ది చేకూరిందని ఏ రాష్ట్రంలో ఉన్నా రేషన్ పొందగలుగుతున్నారని తెలిపారు.
ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ పథకం ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పూర్తి స్థాయిలో అమలులో ఉందని ప్రధాన్ మంత్రీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులను కవర్ చేస్తుందని తెలిపారు. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 158 కోట్లకు పైగా పోర్టబిలిటీ లావాదేవీలు జరిగాయని ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం కింద 16.12 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు నమోదు అయ్యాయని తెలిపారు,
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో భాగంగా ఈ పథకం దేశ వ్యాప్తంగా అమలవుతున్న కారణంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించబడలేదని తెలిపారు. ఈ-పోస్ సిస్టమ్ ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణను నిర్వహించడం వల్ల అవకతవకలను నివారించడం జరిగిందని తద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ అందిచడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం లబ్ధిదారులందరికీ ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తోందని తద్వారా వారి హక్కులను సక్రమంగా పొందేందుకు వీలు కల్పిస్తోందని తెలియజేశారు.