–పెళ్ళిఖర్చుల నిమిత్తం రూ.15 వేలు అందచేసిన గద్దె క్రాంతి కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కుమారుడు గద్దె క్రాంతి కుమార్ చెప్పారు. బుధవారం ఉదయం 22వ డివిజన్‌లోని కృష్ణలంక సతీష్‌కుమార్ రోడ్డులో గద్దె క్రాంతి కుమార్ పర్యటించి అక్కడి వారితో మాట్లాడారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా తెల్సుకసున్నారు. స్థానికంగా పార్టీ అభివృద్థికి ఎంతో కృషి చేసి మరణించిన టీడీపీ కార్యకర్త సింహాద్రి రాజు ఇంటికి వెళ్ళి ఆయన కుమార్తె గాయత్రి వివాహ ఖర్చుల నిమిత్తం రూ.15 వేలను గద్దె క్రాంతి కుమార్ స్వయంగా అందచేశారు.
ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యo కోసం అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అన్ని వేళలా అండగా ఉన్నది పార్టీ కార్యకర్తలేనని అన్నారు. దేశ రాజకీయ చరిత్రలో అనేక ప్రాంతీయ పార్టీలు పెట్టినా అతి తక్కువ సమయంలోనే కాలగర్భంలో కలిసిపోయాయని, కాని తెలుగుదేశం పార్టీ స్థాపించిన 40 వసంతాలు దాటినా ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉందంటే అందుకు బలమైన కారణం పార్టీ కార్యకర్తలేనని అన్నారు. పార్టీ కార్యకర్తల కష్టం, శ్రమతోనే నేటికి పసుపు జెండా రెపరెపలాడుతుందని అన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉండటం టీడీపీ అదృష్టమన్నారు. అలాంటి కార్యకర్తల క్షేమం, వారి కుటుంబ సభ్యులకు సంక్షేమాన్ని అందిస్తూ వారికి అండగా ఉండటం పార్టీలోని నాయకుల బాధ్యత అని అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఎల్లప్పుడు అండగా ఉంటూ వారికి కొండంత భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే కృష్ణలంకలో తెలుగుదేశం పార్టీ అభివృద్థికి ఎంతగానే కృషి చేసి మరణించిన సింహాద్రి రాజు కుమార్తె వివాహానికి రూ.15 వేలు అందచేస్తున్నామని చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ జెండా ఎల్లప్పుడు అండగా ఉంటుందని గద్దె క్రాంతి కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ నాయకులు పలిశెట్టి అన్నారావు, నడికప్పుల రవి, టెంటు రాజేష్, సంతోష్, వెంకట్రావ్, జనసేన నాయకుడు తోట శ్రీను తదితరులు గద్దె క్రాంతికుమార్ వెంట ఉన్నారు.