-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి
-విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం
-విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వరదలు రావటానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
-అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలు ఏర్పాటు ఈ బిల్లులో అత్యంత కీలక సవరణ
-ఎస్.డి.ఆర్.ఎఫ్ నిధులు 2015 నుండి 2023 వరకు 3 రెట్లు పెరిగి ₹1 లక్ష కోట్లు చేరుకున్నాయి.
-విపత్తు సమయంలో తక్షణ సాయం అందించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో గత 50 ఏళ్లలో లేని విధంగా సెప్టెంబర్ లో అత్యధిక వర్షపాతం నమోదై నగరాన్ని భారీ స్థాయిలో వరదలు ముంచెత్తాయి. ఈ వరద విపత్తు సమయంలో కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించింది ఎంతో సాయం చేసింది. అలాగే ప్రస్తుతం ఉన్నత స్థాయి కమిటీ వద్ద పెండింగ్ లో వున్న రూ.1100 కోట్ల వరద సాయం నిధులను త్వరగా రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు.
లోక్ సభలో గురువారం విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024 కి ఎంపి కేశినేని శివనాథ్ మద్దతు తెలుపుతూ ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలకి సంబంధించి పలు అంశాలు లెవనెత్తారు.
విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాటానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు. ఈ వరదలు ప్రకృతి వైపరీత్యంతో పాటు మావనతప్పిదాల కారణంగా సంభవించాయన్నారు. కాలువల పూడిక తీయకపోవటం వల్ల నగరం భారీ వరదలతో నష్టపోయిందని చెప్పారు. ఈ కారణంగా 3 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయుల కావటంతో పాటు అనేక హెక్టార్ల పంట భూమి నీట మునిగిందని పేర్కొన్నారు. వరద వచ్చిన మొదటి 24 గంటల్లో బాధితులకు సహాయం చేయటానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఉపయోగించి సాంకేతికతను వినియోగించి డ్రోన్ల ద్వారా ఆహార ప్యాకెట్ల పంపిణీ, ఫైర్ ఇంజన్స్ తో బురదతో నిండిన ఇళ్లను శుభ్రం చేయటం వంటి చర్యలు చేపట్టి నగరాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చారని వివరించారు. ఇక వరద విపత్తు సమయంలో కేంద్ర ప్రభుత్వం సకాలంలో సాయం అందించిన సహాయానికి గాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
మన దేశంలో తరచుగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సకాలంలో తీసుకువచ్చిన చట్టం విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024 అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో 2015 నుండి 2023 వరకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కి మంజూరైన నిధులు దాదాపు మూడు రెట్లు పెరిగి సుమారు రూ.1 లక్ష కోట్లకు చేరుకున్నాయన్నారు. .
ఈ బిల్లు ముఖ్యంగా వాతావరంణలో సంభవించే మార్పులు అధిక ఉష్టోగ్రతలు, భారీ వర్షాలు, తుఫానుల వల్ల ఏర్పడే ప్రమాదాలను తగ్గించడంపై ప్రత్యేకమైన దృష్టి సారించిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 40% ప్రాంతం వాయుగుండాల ప్రభావానికి లోనవుతుంది. 2014 నుంచి 2020 మధ్య కాలంలో రాష్ట్రానికి హుద్ హుద్, తిత్లీ వంటి తుఫాన్లు ఎంతో నష్టం మిగిల్చాయి. ఇక దేశ వ్యాప్తంగా కూడా అత్యధిక సంఖ్యలో తుఫానులను ఎదుర్కొవాల్సి వచ్చింది.
ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడంలో సంసిద్ధత, దృఢమైన స్థితిని బలోపేతం చేసుకోవటం కోసం NDMA (జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ) , SDMA (రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ)ల నుంచి ఈ ప్రమాదాలను ముందస్తుగా అంచనా వేసి, వాటి పై ప్రణాళికలు తయారుచేయటం ఈ బిల్లు తప్పనిసరి చేస్తుందని పేర్కొన్నారు.
అలాగే ఈ బిల్లు జాతీయ, రాష్ట్ర స్థాయిలలో కేంద్రీకృత విపత్తు డేటాబేస్ కూడా పరిచయం చేస్తుందని, .
ఈ వ్యవస్థ విపత్తుల వర్గీకరణను మెరుగుపర్చడంలో సహాయపడటంతో పాటు, తద్వారా మ్యాపింగ్, స్పందన ప్రణాళికలు, నివారణ చర్యలు మరింత సమర్ధవంతంగా అమలుపరచవచ్చునని తెలిపారు.
ఈ బిల్లు లో అతి కీలకమైన సవరణ అంటే రాష్ట్ర రాజధానులతో పాటు నగరాల్లో కూడా అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలు స్థాపించడమన్నారు. .విపత్తుల కారణంగా ఎలాంటి ప్రమాదాలు, నష్టాలు సంభవిస్తాయో స్వయంగా చూసిన తాను అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం సరైన సమయంలో తీసుకున్న మంచి నిర్ణయంగా భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.
అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (UDMA) పనితీరు మరింతగా మెరుగుపరచటానికి పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు భాగం చేయాలని సిఫార్స్ చేశారు. విపత్తులు ఎక్కువగా సంభవించే జపాన్ వంటి దేశాల్లో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు అవుతున్నట్లు తెలిపారు. NDA కూటమి సుపరిపాలన, పారదర్శకత అభివృద్ధికి కట్టుబడి ఉంటుందన్నారు. పార్లమెంట్ లో తన తొలి ప్రసంగం తన పార్లమెంట్ నియోజకవర్గంలో వరదల కారణంగా ఏర్పడిన నష్టాన్ని పరిష్కరించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.